భారత్ లో కార్ల తయారీకి ఫోర్డ్ గుడ్ బై
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ లో కార్ల తయారీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించింది. దేశంలోని రెండు ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేయనుంది. పదేళ్ల కాలంలో రెండు బిలియన్ డాలర్ల నిర్వహణ నష్టాలే ఈ నిర్ణయానికి కారణంగా చెబుతోంది. తమిళనాడులోని చెన్నయ్, గుజరాత్ లోని సనంద్ ప్లాంట్ లు మూతపడనున్నాయి. ఫోర్డ్ నిర్ణయం వల్ల ఏకంగా 4000 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. భారీ నష్టాలు రావటం ఒకెత్తు అయితే..కార్ల మార్కెట్లో ప్రగతి కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
భారత్ నుంచి వైదొలగిన రెండవ ఆటోమొబైల్ సంస్థగా ఫోర్డ్ నిలుస్తుంది. గతంలో జనరల్ మోటార్స్ కూడా ఇలాగే భారత్ మార్కెట్ కు గుడ్ బై చెప్పింది. దీర్ఘకాలిక వ్యూహలు..భవిష్యత్ అవసరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత్ లో తమ వ్యాపారాన్ని పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ఫోర్డ్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో జిమ్ ఫార్లీ తెలిపారు. గత ఏడాదిన్నరగా కరోనా కారణంగా ఆటోమొబైల్ మరింత సమస్యల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.