మూడు వేలు చెల్లిస్తే..దేశంలో ఎక్కడైనా తిరగొచ్చు

ఫాస్టాగ్ పాస్ వచ్చేస్తోంది. ఏడాది పాటు అమలులో ఉండే పాస్ ను తీసుకొస్తోంది కేంద్రం. ఇప్పటి వరకు వాహనదారులు ఏ ట్రిప్ కు ఆ ట్రిప్ కే టోల్ గేట్స్ దగ్గర చార్జీలు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వార్షిక పాస్ తీసుంటే ఏడాది పాటు జాతీయ రహదారులపై దూసుకెళ్లొచ్చు. ఇది ఈ ఆగస్ట్ 15 నుంచే వాహనదారులకు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మూడు వేల రూపాయలు చెల్లించి వార్షిక పాస్ తీసుకుంటే ఇది ఏడాది పాటు...లేదంటే రెండు వందల ట్రిప్ లు పూర్తి అయ్యేవరకు చెల్లుబాటు అవుతుంది. ఇందులో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది. దేశంలోని ఏ జాతీయ రహదారులపై అయినా ఇది చెల్లుబాటు అవుతుంది.
వాణిజ్యేతర, వ్యక్తిగత వాహనాలు అయిన కార్లు, జీపులు, వ్యాన్లకు ఈ ఈ అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి ఎక్స్ లో వెల్లడించారు. ఇది తరచుగా పర్యటనలు చేసే వాళ్లకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది..అదే సమయంలో టోల్ గేట్ దగ్గర ఎక్కువ సమయం ఉండాల్సిన అవసరం లేకుండా చేస్తుంది అన్నారు. రాజమార్గ్ యాత్ర యాప్ తో పాటు ఎన్ హెచ్ఏఐ, ఉపరితల రవాణా శాఖ వెబ్ సైట్స్ ద్వారా కూడా దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ వార్షిక ఫాస్టాగ్ పాస్ ను తీసుకొస్తున్నది లక్షలాది మంది ప్రైవేట్ వాహనదారులు వేగంగా..సాఫీగా మంచి ప్రయాణ అనుభూతి పొందేందుకే అని తెలిపారు.



