Telugu Gateway
Top Stories

ఢిల్లీలో టెన్షన్ ...టెన్షన్

ఢిల్లీలో టెన్షన్ ...టెన్షన్
X

వ్యవసాయ చట్టాలను వ్యతికేకిస్తూ రైతులు తలపెట్టిన 'ట్రాక్టర్ల ర్యాలీ' దారితప్పింది. అనుమతి లేని ప్రాంతం ఎర్రకోట వద్దకు చేరుకున్న రైతులు భద్రతా వలయాన్ని చేధించి మరీ ఎర్రకోటపై జెండా ఎగరేశారు. ఈ సమయంలో పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ జరిగింది. అయినా సరే రైతులను నిలువరించటంలో భద్రతా సిబ్బంది విఫలమవటంతో కొంత మంది ఎర్రకోట బురుజులపైకి ఎక్కి అక్కడ జెండాను ఉంచారు. రైతులను నియంత్రించేందుకు పోలీసులు పలుమార్లు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. గణతంత్ర దినోత్సవం రోజు రైతులు అత్యంత భద్రత ఉండే ఎర్రకోట వద్దకు చేరుకోవటమే పెద్ద పరిణామంగా మారింది. వేలాదిగా ట్రాక్టర్లు దేశ రాజధాని వైపు తరలి రావడంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మంగళవారం కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేసింది. అంతే కాదు..శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఖాజీపూర్, తిక్రిత్, సింగ్ నంగ్లోయి తదితర ప్రాంతాలలో అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. రైతుల ట్రాక్టర్ రిపబ్లిక్ డే ర్యాలీలో ఢిల్లీ ఐటీఓ సమీపంలో ఒక నిరసనకారుడు మరణించడం మరింత ఆందోళనకు దారి తీసింది. నగరంలోకి చొచ్చుకొచ్చిన రైతులను నిలువరించేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. లాఠీలు ఝళిపించారు. ఈ ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు జరిపిన కాల్పుల్లో రైతు మృతి చెందారని రైతు ఉద్యమకారులు తెలిపారు.

మృతుడిని ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌కు చెందిన నవనీత్ సింగ్‌గా గుర్తించినట్టు చెప్పారు. అయితే ట్రాక్టరు తిరగబడటంతో రైతు చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. ఎర్రకోటలోజెండా ఎగురవేయడంపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఢిల్లీలో రైతుల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఏ సమస్యకూ హింస పరిష్కారం కాదని రాహుల్ ట్వీట్‌ చేశారు. మరోవైపు ర్యాలీ రూటు మార్పులో తమ పాత్ర ఏదీ లేదని సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు పేర్కొన్నారు. కొంతమంది అరాచకవాదులు, అసాంఘిక శక్తులు తమ శాంతియుత ఉద్యమంలోకి చొరబడ్డాయని ఆరోపించారు.

Next Story
Share it