Telugu Gateway
Top Stories

అధికారికంగా ప్రకటించిన హోమ్ శాఖ

అధికారికంగా ప్రకటించిన హోమ్ శాఖ
X

అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

పెద్ద నోట్ల రద్దుతో ఇక దేశంలో ఫేక్ కరెన్సీ అన్నదే కనిపించదు అంటూ గతంలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. కేంద్రం కూడా పెద్ద నోట్ల రద్దు ప్రధాన ఉద్దేశాల్లో ఇది కూడా ఒకటి అని అధికారికంగా చెప్పింది. కేంద్రంలోని మోడీ సర్కారు వెయ్యి, ఐదు వందల నోట్ల ను రద్దు చేస్తూ 2016 నవంబర్ లో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత మళ్ళీ కొత్తగా రెండు వేల రూపాయల నోట్ తో పాటు కొత్త ఐదు వందల రూపాయల నోట్లు అందుబాటులోకి తెచ్చి...2023 మేలో తిరిగి రెండు వేల రూపాయల నోట్ ను కూడా రద్దు చేశారు. ఇప్పుడు దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోటు అంటే ఐదు వందల రూపాయలే. ఇప్పుడు ఇది అంతా ఎందుకు అంటే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సోమవారం నాడు సంచలన ప్రకటన చేసింది. అది ఏంటి అంటే దేశంలో పెద్ద ఎత్తున నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు చలామణిలోకి వచ్చాయని హెచ్చరించింది. అత్యాధునిక టెక్నాలజీ వాడి ఈ నోట్లను ముద్రించారు అని..వీటిని గుర్తించటం కూడా ఎంతో కష్టంగా మారింది అని వెల్లడించింది.

వీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. చాలా పరీక్షగా గమనిస్తేనే కానీ.. అసలు నోటుకు, నకిలీ నోటుకు తేడా తెలియని విధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే ఈ నకిలీ నోట్లకు, అసలు నోట్లకు మధ్య తేడాను గుర్తించటానికి చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని.. దీనిని తరిచి తరిచి చూస్తే గుర్తించవచ్చు అని ప్రజలకు సూచించింది. దీనిని గుర్తించడంలో ఇదే కీలకమని పేర్కొంది.కరెన్సీ నోట్లపై సాధారణంగా RESERVE BANK OF INDIA అని ఉంటుందని.. కానీ దానిలో RESERVE అనే పదంలో Eకి బదులుగా A అని ఉంటుందని.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు స్పష్టంగా పరిశీలించాలని ప్రజలకు సూచించింది. దేశంలో ఐదు వందల రూపాయల నకిలీ నోట్ల చలామణి అంశాన్ని ఇప్పటికి హోమ్ శాఖ డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డి ఆర్ఐ), సిబిఐ తో పాటు ఎన్ఐఏ, సెబీ, ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)కు తెలియచేసింది. ఆర్థిక సంస్థలతో పాటు బ్యాంకు ఏజెన్సీ లను కూడా వీటి విషయంలో అప్రమత్తం చేశారు.

Next Story
Share it