పుతిన్ ఆస్తులను స్తంభింపచేసిన ఈయూ
ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు దాడులు కొనసాగిస్తూనే రఫ్యా చర్చలకు సిద్ధం అని ప్రకటిస్తోంది. మరో వైపు అంతర్జాతీయ సమాజం రష్యాపై మరిన్ని కఠిన చర్యలకు పూనుకుంటోంది. అయితే ఇలాంటి చర్యలకు పుతిన్ మెత్తబడాతారా..తాను అనుకున్న పని పూర్తి చేస్తారా అన్నది వేచిచూడాల్సిందే. శుక్రవారం నాడు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు దిగిన రష్యాపై ఐరోపా, అమెరికా సహా పలు ఆసియా పసిఫిక్ దేశాలు వరస పెట్టి కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.
ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై యూరోపియన్ యూనియన్(ఈయూ) ఆంక్షలు విధించింది. పుతిన్, రష్యా విదేశాంగశాఖ మంత్రి లావ్రోవ్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్టు ఈయూ వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్ అధికారులతో చర్చలకు పుతిన్ సిద్దంగా ఉన్నారని రష్యా అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. చర్చల కోసం బెలారస్ రాజధాని మిన్‌స్క్‌కు రష్యా ఓ బృందాన్ని పంపనున్నట్టు పేర్కొంది. చైనా కూడా తాజాగా రంగంలోకి దిగింది. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య నెలకొన్న సమస్య పరిష్కారం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామని జిన్ పింగ్ తెలిపారు.