Telugu Gateway
Top Stories

మస్క్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం

మస్క్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం
X

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఇండియాలో స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు రాకుండా అడ్డుకుంటున్నారు అని ఆరోపించారు. వాళ్ళు ఎవరో మీరే ఊహించుకోండి అని పేర్కొన్నారు. కొంత మంది తమ గుత్తాధిపత్యం కాపాడుకునేందుకే ఇలా చేస్తున్నారు అంటూ ఎలాన్ మస్క్ ఆరోపించారు. విచిత్రం ఏమిటి అంటే ఇండియా లో స్టార్ లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీస్ లకు అనుమతి ఇవ్వటాన్ని దేశంలోని దిగ్గజ టెలికం,డేటా సేవల రంగంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న సంస్థలు రిలయన్స్ జియో తో పాటు ఎయిర్ టెల్ లు వ్యతిరేకించాయి. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత కొద్ది నెలలకే ఇండియా లోకి స్టార్ లింక్ ఎంట్రీ ఖరారు కావటంతో ఈ రెండు సంస్థలు కూడా ఎలాన్ మస్క్ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ ఇప్పటి వరకు ఇండియా ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ కమ్యూనికేషన్ సర్వీస్ లు అందుబాటులోకి రాలేదు. ఇండియా లోకి స్టార్ లింక్ సర్వీస్ లు రాకుండా అడ్డుకోవటం భారత ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరమని సంచలన ఆరోపణలు చేశారు.

ఈ విషయంపై ఎక్స్ వేదికగా స్పందించిన మస్క్.. పేరు ప్రస్తావించకుండానే భారతదేశ టెలికాం రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. దేశం లో ఇంటర్నెట్ సదుపాయమే లేని మారుమూల ప్రాంతాల వారికి స్టార్‌లింక్ ద్వారా అత్యంత వేగవంతమైన, సరసమైన ఇంటర్నెట్‌ను అందించవచ్చని మస్క్ పేర్కొన్నారు. గతంలోనే స్టార్‌లింక్ భారత్‌లో 20 గేట్‌వే సైట్లను సిద్ధం చేసినప్పటికీ, లైసెన్సింగ్ ప్రక్రియను, స్పెక్ట్రమ్ కేటాయింపులను ఈ కార్పొరేట్ శక్తుల ఒత్తిడి వల్లే ఆలస్యం చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. అయితే ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా చేసిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. ఎలాన్ మస్క్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం...తప్పుగా అర్ధం చేసుకోవటం వంటివే అన్నారు. దేశం లో అమలులో ఉన్న విధానాలే ప్రతిఒక్కరికి వర్తిస్తాయి అని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ స్పష్టం చేసింది. స్టార్ లింక్ కు స్పెక్ట్రమ్ కేటాయించే ముందు సెక్యూరిటీ క్లియరెన్స్ తో పాటు పలు నియంత్రణ సంస్థల మదింపు కూడా అవసరం అవుతుంది అని తెలిపారు. దేశంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏ విదేశీ సంస్థ అయినా ఇక్కడి నియమ, నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు.

Next Story
Share it