Telugu Gateway
Top Stories

కేంద్రంపై ఆగ్రహమా...లేక వేరే ఎజెండా ఉందా?!

కేంద్రంపై ఆగ్రహమా...లేక వేరే ఎజెండా ఉందా?!
X

కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా విధాన నిర్ణయాలను దిగ్గజ కార్పొరేట్ సంస్థలు ప్రభావితం చేస్తాయనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ హయాంతో పాటు గత పన్నెండు సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ సారథ్యంలోని మోడీ సర్కారు పై కూడా ఇవే తరహా విమర్శలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన విమర్శలు ఏమీ కావు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గత కొన్ని రోజులుగా దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన ముకేష్ అంబానీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుండటం ఇప్పుడు దేశ రాజకీయ వర్గాలతో పాటు కార్పొరేట్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. మరి కొద్ది రోజుల్లోనే రిలయన్స్ జియో ఐపీవో మొదలుకానున్న తరుణంలో ఎలాన్ మస్క్ వరసపెట్టి అంబానీని టార్గెట్ చేయటం వెనక ఏదైనా ఎజెండా ఉందా అన్న చర్చ సాగుతోంది. మరో కీలక విషయం ఏమిటి అంటే ఇదే ఎలోన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ భారత్ లో సాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిలయన్స్ జియో తో ఒప్పందం చేసుకుంది. 2025 మార్చిలోనే ఈ ఒప్పందం కుదిరింది.

వాస్తవానికి గతంలో రిలయన్స్ జియో తో పాటు ఎయిర్ టెల్ కూడా స్పెక్ట్రమ్ కేటాయింపు విషయంలో టెలికాం కంపెనీలకు కేటాయించిన విధానం ప్రకారమే వేలం ద్వారా స్టార్ లింక్ కు స్పెక్ట్రమ్ కేటాయించాలని డిమాండ్ చేశాయి. అన్ని సంస్థలకు సమాన అవకాశాలు (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్) ఉండేలా చూడాలని కేంద్రాన్ని కోరాయి. ఆ తర్వాత ఈ రెండు సంస్థలు స్టార్ లింక్ తో ఒప్పందం చేసుకున్నాయి. ఇటీవల ఎలాన్ మస్క్ ముకేష్ అంబానీని ఉద్దేశించి వ్యంగంగా భారత ప్రధాని అంబానీ గారు అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. వాస్తవానికి ఇప్పుడు దేశంలో ప్రధాని మోడీ కి అంబానీ కంటే మరో దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ అత్యంత సన్నిహితుడు అనే ప్రచారం రాజకీయ, కార్పొరేట్ వర్గాల్లో ఉంది. అలాంటిది మస్క్ ఒక్క అంబానీని టార్గెట్ చేయటం వెనక తన కంపెనీ స్టార్ లింక్ కు అనుమతుల మంజూరు లో జరుగుతున్న జాప్యం తో పాటు ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రిలయన్స్ జియో ఐపీవో అక్టోబర్ 21 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్న తరుణంలో ఎలాన్ మస్క్ వరసపెట్టి ముకేష్ అంబానీపై పోస్ట్ లు పెడుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

బీజేపీ కి భారీ ఎత్తున రిలయన్స్ ఎన్నికల నిధులు సమకూర్చింది అంటూ గతంలో మీడియా లో వచ్చిన వార్తలను కూడా తాజాగా ఎలాన్ మస్క్ ఎక్స్ లో షేర్ చేశారు. ఒక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే కాకుండా దేశంలోని దిగ్గజ సంస్థలు అన్నీ కూడా నేరుగా..పరోక్షంగా కీలక పార్టీలకు ఎన్నికల నిధులు సమకూరుస్తాయి అన్నది బహిరంగ రహస్యమే. వరసపెట్టి ఎలాన్ మస్క్ అటు కేంద్ర ప్రభుత్వాన్ని ...ముకేశ్ అంబానీ ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. కొంత మంది పెద్దల ప్రయోజనాలు కాపాడేందుకే స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులకు అనుమతి ఇవ్వటం లేదు అంటూ ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలను కేంద్ర తోసిపుచ్చింది. తాము అన్ని కంపెనీల విషయంలో ఒకేలా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయినా సరే ఎలాన్ మస్క్ ఎటాక్ మాత్రం ఆగటం లేదు.

Next Story
Share it