Telugu Gateway
Top Stories

ట్విట్ట‌ర్ తో ఎల‌న్ మ‌స్క్ బేరాలు!

ట్విట్ట‌ర్ తో ఎల‌న్ మ‌స్క్ బేరాలు!
X

ప్ర‌పంచ సంప‌న్నుడు ఎల‌న్ మ‌స్క్ ట్విట్ట‌ర్ తో ఒప్పందం ర‌ద్దు చేసుకుని చిక్కుల్లో ప‌డ్డారు. ఈ ఒప్పందం నుంచి వెన‌క్కి త‌గ్గితే ఆయ‌న ఏకంగా భార‌తీయ క‌రెన్సీలో 8000 కోట్ల రూపాయ‌ల న‌ష్టప‌రిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే ఈ ఒప్పందం ర‌ద్దు వ్య‌వ‌హారంపై ట్విట్ట‌ర్ డెలావ‌ర్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై ప్రాధ‌మిక విచార‌ణ అక్టోబ‌ర్ 17 నుంచి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ట్విట్ట‌ర్ డీల్ కు ఎల‌న్ మ‌స్క్ ఆ సంస్థ యాజ‌మాన్యంతో కొత్త‌గా ప‌లు బేరాలు పెడుతున్న‌ట్లు న్యూయార్క్ టైమ్స్ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. 44 బిలియ‌న్ డాల‌ర్ల‌కు ట్విట్ట‌ర్ కొనుగోలుకు ఎల‌న్ మ‌స్క్ తొలుత ఒప్పందం చేసుకున్న విష‌యం తెలిసిందే. త‌ర్వాత ముందు అనుకున్న దానికంటే స్పామ్ ఖాతాలు ఎక్కువ ఉన్నాయంటూ మెలిక పెట్టి ఆయ‌న ఒప్పందం ర‌ద్దుకు నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే తాజాగా ఆయ‌న తొలుత ప్ర‌కటించిన 44 బిలియ‌న్ డాల‌ర్ల డీల్ పై 30 శాతం డిస్కౌంట్ ఇవ్వాల‌నే ప్ర‌తిపాద‌న తెర‌పైకి తెచ్చారు.

ఇలా చేస్తే డీల్ త‌న‌కు ఓకే అన్నారు. దీనికి ట్విట్ట‌ర్ బోర్డు నో చెప్పింది. త‌ర్వాత బేరాన్ని 30 శాతం నుంచి ప‌ది శాతం డిస్కౌంట్ కు త‌గ్గించారు. దీనికీ నో అన‌టంతో ఆయ‌న ఇక విచార‌ణ‌కు సిద్ధ‌ప‌డాల్సిన ప‌రిస్థితి. ఒప్పందంతో ముందుకు వెళ్ల‌ట‌మా లేక ర‌ద్దు వ‌ల్ల ష‌ర‌తుల‌కు లోబ‌డి ఎనిమిది వేల కోట్ల రూపాయ‌ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌ట‌మా అన్న‌ది రాబోయే రోజుల్లో తేల‌నుంది. తాను ట్విట్ట‌ర్ డీల్ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తాజాగా ఎల‌న్ మ‌స్క్ ట్విట్టర్ బోర్డుకు లేఖ రాసిన‌ట్లు ఇందులో పేర్కొన్నారు. నిధులు స‌ర్దుబాటు అయితే పాత ధ‌ర‌కే తాను కొనుగోలుకు రెడీగా ఉన్న‌ట్లు తాజాగా మ‌రో సారి లేఖ పంపిన‌ట్లు ఇందులో పేర్కొన్నారు. మ‌రి చివ‌ర‌కు ఏమి అవుతుందో వేచిచూడాల్సిందే. ఎల‌న్ మ‌స్క్ ట్విట్ట‌ర్ కొనుగోలు విష‌యంలే బేరాలు పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Next Story
Share it