Telugu Gateway
Top Stories

టెస్లా యూనిట్ తో ఎన్నికల్లో లబ్దిపొందేందుకు స్కెచ్!

టెస్లా యూనిట్ తో ఎన్నికల్లో లబ్దిపొందేందుకు స్కెచ్!
X

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ టూర్ పై బీజేపీ సర్కారు ..ముఖ్యంగా ప్రధాని మోడీ భారీ ఆశలే పెట్టుకున్నారు. అత్యంత కీలకమైన లోక్ సభ ఎన్నికల సమయంలో ఎలాన్ మస్క్ తో భారత్ లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల యూనిట్ పై ప్రకటన చేయించి లబ్ది పొందాలనేది అటు మోడీ..ఇటు బీజేపీ సర్కారు ప్లాన్. దీని కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఒక ప్లాన్ సిద్ధం చేశారు. అందులో భాగంగానే ఎలాన్ మస్క్ ఇండియా టూర్ టైం, డేట్స్ కూడా సెట్ చేశారు. ఇది అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది అనే అభిప్రాయం అధికార వర్గాల్లో ఉంది. లేక పోతే దేశం అంతా ఎన్నికల్లో మునిగి ఉన్న సమయంలో అసలు ఎవరైనా ఇంతటి కీలక సమావేశం పెట్టుకుంటారా అని కొంత మంది అధికారులు సందేహాలు వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం అయితే ఎలాన్ మస్క్ ఏప్రిల్ 21 -22 తేదీల్లో భారత్ లో పర్యటించాల్సి ఉంది. ఈ టూర్ లో అయన ప్రధాని మోడీ తో సమావేశం అయి ఇండియా లో పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ ఎలాన్ మస్క్ శనివారం నాడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. టెస్లా కు సంబంధించిన తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఇండియా టూర్ వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది చివరిలో పర్యటిస్తానని తెలిపారు.

ఇది మోడీ కి రాజకీయంగా ఎదురుదెబ్బ వంటిదే అని అధికారులు, అభిప్రాయపడుతున్నారు. తాజా పరిణామాలపై ఎలాన్ మస్క్ టూర్ వాయిదాపై కాంగ్రెస్ కూడా స్పందించింది. ఇండియా బ్లాక్ ప్రధాని త్వరలోనే ఎలాన్ మస్క్ కు స్వాగతం పలుకుతారు అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. బీజేపీ ప్రభుత్వం కంటే మరింత వేగంగా ఇండియా కూటమి ప్రభుత్వం దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రోత్సహిస్తుంది అని తెలిపారు. ఈ సమయంలో అంటే పదవి కాలం ముగియనున్న ప్రధానిని కలవటం ఎందుకులే అని ఎలాన్ మస్క్ తన టూర్ ను వాయిదా వేసుకున్నట్లు ఉన్నారు అని జైరాం రమేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జైరాం రమేష్ కామెంట్స్ చూస్తే పరిస్థితి ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది.

టెస్లా ఇండియా లో ప్రతిపాదించిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కు వెళుతుందా..లేక మరో బీజేపీ పాలిత రాష్ట్రానికా అన్న ప్రశ్నలు ఎదురుకాగా...భారత్ కి ఆ కంపెనీ పెట్టుబడుల వస్తాయనే కోణంలో చూడాలే తప్ప..యూనిట్ ఎక్కడ అన్న కోణంలో కాదు అంటూ కొంత మంది కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించారు. టెస్లా, ఎక్స్(పూర్వ ట్విట్టర్) తో పాటు వైవిధ్యమైన ఎన్నో వ్యాపారాలు కలిగి ఉన్న ఎలాన్ మస్క్ ప్రపంచ సంపన్నుల్లో ఎక్కువ సార్లు నంబర్ వన్ గా ఉంటారు. స్టాక్ మార్కెట్ కదలికలకు అనుగుణంగా ఇందులో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎలక్ట్రిక్ కార్ల యూనిట్ కు భారీ రాయితీల కోసం టెస్లా ఎప్పటి నుంచో కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. భారత్ లో టెస్లా యూనిట్ తో పాటు స్టార్ లింక్ శాటిలైట్స్ ద్వారా ఇండియా లో ఇంటర్నెట్ సేవలు అందించే అంశంపై కూడా నిర్ణయాన్ని ప్రకటిస్తారు అని భావించారు. కానీ మస్క్ టూర్ వాయిదాతో ఇక ఇవి అన్నీ కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కొత్త ప్రభుత్వంలోనే దీనిపై నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.

Next Story
Share it