Telugu Gateway
Top Stories

ఎల‌న్ మ‌స్క్ ప్రైవేట్ ఎయిర్ పోర్టు!

ఎల‌న్ మ‌స్క్ ప్రైవేట్ ఎయిర్ పోర్టు!
X

దేశంలోనూ...విదేశాల్లోనూ సంప‌న్నులు ప్రైవేట్ జెట్ విమానాలు కొనుగోలు చేయ‌టం..అందులో చ‌క్కర్లు కొట్ట‌డం సాధార‌ణ‌మే. తెలుగు రాష్ట్రాల సీఎంలే గ‌తానికి భిన్నంగా ఎక్కితే ప్రైవేట్ విమానం..దిగితే ప్రైవేట్ విమానమే. షెడ్యూల్డ్ స‌ర్వీసుల‌ను వాడ‌ట‌మే పూర్తిగా మ‌ర్చిపోయారు. ఒక‌ప్పుడు సీఎంలు కూడా విమానాశ్ర‌యానికి వెళ్లి..రెగ్యుల‌ర్ విమానాల్లోనే ఢిల్లీకి..ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఏపీ సీఎం జ‌గ‌న్ అయితే ఏకంగా విదేశాల‌కు కూడా ప్రైవేట్ విమానాల్లోనే వెళుతున్నారు. తాజాగా ఓ ఆస‌క్తిక‌ర వార్త వెలుగులోకి వ‌చ్చింది. అది ఏమిటి అంటే ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్నుడుగా ఉన్న టెస్లా అధినేత ఎల‌న్ మ‌స్క్ ఏకంగా ప్రైవేట్ విమానాశ్ర‌యాన్ని నిర్మించే ఆలోచ‌న‌లో ఉన్నారంట‌. అది అమెరికాలోని టెక్సాస్ లో రావొచ్చ‌ని ఓ క‌థ‌నం ప్ర‌చురితం అయింది. ఈ ప్రైవేట్ విమానాశ్ర‌యాన్ని ఎల‌న్ మ‌స్క్ తో పాటు ఆయ‌న కంపెనీకి చెందిన ఇత‌ర ఎగ్జిక్యూటివ్ లు..టెక్సాస్ లోనే ఉన్న స్పేస్ ఎక్స్, ద బోరింగ్ కంపెనీ అవ‌స‌రాల‌కు దీన్ని వాడే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. గ‌త డిసెంబ‌ర్ లో ఎల‌న్ మ‌స్క్ సిలికాన్ వ్యాలీలో ఉన్న టెస్లా ప్ర‌ధాన కార్యాల‌యాన్ని టెక్సాస్ కు త‌ర‌లించిన విష‌యం తెలిసిందే.

ఈ ప్రాంతంలో ఎల‌న్ మ‌స్క్ కంపెనీల‌కు భారీ ఎత్తున భూముల ఉన్నాయ‌ని పేర్కొన్నారు. అంతే కాదు..కొత్త ప్రైవేట్ విమానాశ్ర‌యమే కాదు..త‌న అవ‌స‌రాల‌కు వాడేందుకు ఓ కొత్త జెట్ కొనుగోలుకు కూడా ఆర్డ‌ర్ ఇచ్చార‌ని ఇండిపెండెంట్ క‌థ‌నం పేర్కొంది. ఇది 2023 సంవ‌త్స‌రంలో అందుబాటులోకి రావొచ్చ‌ని వెల్ల‌డించింది. కొత్త‌గా ప్రైవేట్ విమానాశ్ర‌యం నిర్మించాలంటే ప‌ర్యావ‌ర‌ణ నిబంధ‌న‌ల‌ను పాటించ‌టంతోపాటు..ఫెడ‌ర‌ల్ ఏవియేష‌న్ ఆడ్మినిస్ట్రేష‌న్ (ఎఫ్ఏఏ) అనుమ‌తి కూడా పొందాల్సి ఉంటుంది. భార‌త్ లో చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు..పారిశ్రామిక‌వేత్త‌లు ఇష్టానుసారం ప్రైవేట్ విమానాలు వాడుతున్నా ఎవ‌రూ నోరెత్త‌రు. కానీ అమెరికాలో మాత్రం అది ఎల‌న్ మ‌స్క్ అయినా మ‌రెవరైనా ఇలా అతి త‌క్కువ దూరాల‌కు కూడా ప్రైవేట్ జెట్ లు వాడుతూ ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ప్రైవేట్ విమానాశ్ర‌యం వార్త‌ల‌పై ఎల‌న్ మ‌స్క్ కానీ..ఆయ‌న కంపెనీలు ఎక్క‌డా అధికారికంగా స్పందించ‌లేదు.

Next Story
Share it