ట్విట్టర్ డీల్ కు ఎలన్ మస్క్ గుడ్ బై
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ కొనుగోలు నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికాకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్ ప్రకటించారు. ఆయన తరపున సంస్థ లాయర్లు ఎక్స్చేంజ్ లకు ఈ మేరకు సమాచారం అందించారు. దీంతో ట్విట్టర్ బోర్డు ఒప్పందం అమలు విషయంలో న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫేక్ అకౌంట్లకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వనందునే తాను డీల్ నుంచి వైదొలుగుతున్నట్లు ఎలన్ మస్క్ చెబుతున్నారు. అయితే ఆయన కోరిన సమాచారం అంతా ఇస్తున్నట్లు ట్విట్టర్ చెబుతోంది. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ కొనుగోలుకు ఎలన్ మస్క్ ఏప్రిల్ లో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఎలన్ మస్క్ ఒక బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ట్విట్టర్ చెబుతున్న దాని కంటే స్పామ్ ఖాతాలు బారీ ఎత్తున ఉన్నాయని ఎలన్ మస్క్ ఆరోపిస్తున్నారు. ట్విట్టర్ కొనుగోలుకు సంబంధించి డీల్ కుదుర్చుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ నిత్యం ఏదో ఒక ప్రకటన చేస్తూనే దీన్ని గందరగోళం చేస్తూనే వస్తున్నారు. మధ్యలో ఈ డీల్ ను తాత్కాలికంగా పక్కన పెట్టామన్నారు. ఇప్పుడు చివరకు అసలు పూర్తిగా డీల్ రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. గత కొంత కాలంగా ట్విట్టర్ షేర్లు పతనం అవుతూ వస్తున్నాయి.