స్పేస్ఎక్స్ ఐపీవో వార్తలతో దూసుకెళ్లిన సంపద

ప్రపంచ నంబర్ వన్ సంపన్నుడు ఎలాన్ మస్క్ ఇప్పుడు మరో కొత్త రికార్డు ను అందుకున్నారు. ఆయన సంపద ఇప్పుడు ఏకంగా 600 బిలియన్ డాలర్లను అధిగమించింది. అదే భారతీయ కరెన్సీ లో అయితే ఈ మొత్తం 54 లక్షల కోట్ల రూపాయల పైనే. సడన్ గా ఆయన సంపద భారీగా పెరగటానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటి అంటే త్వరలోనే ఎలాన్ మస్క్ కు చెందిన కంపెనీ స్పేస్ ఎక్స్ ఐపీవోకి రానుంది అనే వార్తలు రావటమే. ఈ వార్తలతోనే ఒక్క రోజులోనే ఎలాన్ మస్క్ సంపద 168 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. దీంతో ఎలాన్ మస్క్ సంపద 677 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ ఫీట్ సాధించిన వ్యక్తి మరొకరు లేరు.
2020 సంవత్సరంలో ఎలాన్ మస్క్ సంపద 24 .6 బిలియన్ డాలర్లు ఉండగా...2025 సెప్టెంబర్ నాటికి ఇది 500 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. స్పేస్ ఎక్స్ కంపెనీలో ఎలాన్ మస్క్ కు 40 శాతం వాటా ఉంది. 800 బిలియన్ డాలర్లు విలువ తో ఈ కంపెనీ ఐపీవో కు వచ్చే అవకాశం ఉంది అనే వార్తలు రావటంతో ఎలాన్ మస్క్ సంపద అమాంతం పెరిగిపోయింది. కొద్ది రోజుల క్రితం ఎలాన్ మస్క్ కు చెందిన కంపెనీ టెస్లా ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే దీనికి ఎలాన్ మస్క్ కొన్ని టార్గెట్స్ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో రాబోయే రోజుల్లో ఎలాన్ మస్క్ సంపద మరింత పెరిగే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. డోనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎలాన్ మస్క్ కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) సారధ్య బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. తర్వాత డోనాల్డ్ ట్రంప్ తో తలెత్తిన విభేదాల వల్ల బయటకు వచ్చి ఇప్పుడు పూర్తి గా తన వ్యాపారాలపై ఫోకస్ పెట్టారు.



