Telugu Gateway
Top Stories

ఎస్ బిఐ కి సుప్రీం షాక్

ఎస్ బిఐ కి సుప్రీం షాక్
X

కేంద్రంలోని మోడీ సర్కారు ను కాపాడేందుకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (ఎస్ బీఐ) చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. సుప్రీం కోర్టు సోమవారం నాడు ఇచ్చిన ఆదేశాలతో ఇక ఎస్ బిఐ ఎలెక్టోరల్ బాండ్స్ ద్వారా ఏ పార్టీ కి ఎన్ని నిధులు వచ్చాయి....అవి ఎవరెవరి దగ్గర ఉంచి వచ్చాయనే విషయాలను బహిర్గతం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి సుప్రీం కోర్టు ఈ వివరాలు మార్చి ఆరు నాటికి కేంద్ర ఎన్నికల సంఘానికి అందచేయాలని ఆదేశించింది. ఆ వెంటనే వాటిని ఈసీ వెబ్ సైట్ లో పెట్టాలని కూడా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. అయితే సుప్రీం విధించిన గడువు రెండు రోజుల్లో ముగుస్తుంది అనగా ఎస్ బిఐ తిరిగి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమకు ఈ వివరాల ఇవ్వటానికి జూన్ వరకు సమయం కావాలని కోరింది. ఇది అంతా పక్కా ప్లాన్ ప్రకారమే కేంద్రంలోని బీజేపీ ని...మోడీ సర్కారు ను కాపాడేందుకే ఎస్ బిఐ ఈ పిటిషన్ వేసినట్లు విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అసలు ఇన్ని రోజులు ఏమి చేశారు..తీర్పు ఎంతో స్పష్టంగా ఇచ్చినా కూడా మళ్ళీ గడువు కావాలని కోరటం అంటే ఇది తీవ్రమైన విషయం అంటూ ఎస్ బిఐ పై సుప్రీం కోర్టు మండిపడింది.

చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసు ను విచారించి ఎస్ బిఐ వెంటనే ఆ వివరాలు ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిందే అని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చేందుకు మోడీ సర్కారు తీసుకొచ్చిన ఎలెక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ ఫిబ్రవరి 15 న వీటిని రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎలెక్టోరల్ బాండ్స్ వివరాలు మార్చి 12 లోగా ఎస్ బిఐ సమర్పించాలని ఆదేశించింది. లేకపోతే కోర్టు ధిక్కరణ చర్యలని ఎస్ బిఐ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఈ వివరాలను మార్చి 15 లోగా తన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని సుప్రీం ఆదేశించింది. గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కే ఈ బాండ్స్ రూపంలో పెద్ద ఎత్తున నిధులు దక్కాయి. ఇప్పుడు అవి ఎవరెవరు ఇచ్చారు అనే విషయాలు బయటకు రాబోతున్నాయి. ఈ వ్యవహారం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రాజకీయ దుమారం రేపటం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story
Share it