రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటెల బర్తరఫ్
ముఖ్యమంత్రి కెసీఆర్ తాను అనుకున్న పని పూర్తి చేశారు. మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి ఆదివారం రాత్రి ప్రకటన వెలువడింది. అంతా ప్లాన్ ప్రకారం జరిగిన వ్యవహారం ఆదివారం రాత్రితో పూర్తి అయినట్లు అయింది. ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రావటం..దీనిపై ముఖ్యమంత్రి కెసీఆర్ ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించటం. అసలు నివేదిక చేతికి అందకముందే ఈటెల రాజేందర్ దగ్గర నుంచి వైద్య ఆరోగ్య శాఖను తప్పించి.. సీఎం కెసీఆర్ తన పరిధిలోకి తెచ్చుకోవటం చకచకా జరిగిపోయాయి.
సీఎస్ నుంచి అందిన నివేదిక మేరకు సీఎం కెసీఆర్ సిఫారసుతో గవర్నర్ ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్సిస్తూ తప్పిస్తూ ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆరోపణలు వచ్చిన వెంటనే ఈటెల రాజేందర్ రాజీనామా చేస్తారని భావించారు. కానీ ఆయన కూడా వ్యూహాత్మకంగా నిర్ణయాలు అన్నీ కెసీఆర్ ద్వారానే జరిగేలా వేచిచూస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పని కూడా పూర్తి అయింది. అయితే ఇప్పుడు ఈటెల రాజేందర్ భవిష్యత్ కార్యక్రమం ఎలా ఉండబోతుంది అన్నదే ఇప్పుడు ఇక తేలాల్సి ఉంది.