మార్కెట్ కు కలిసొచ్చిన 'ఆర్ధిక సర్వే'
దేశీయ మార్కెట్లకు ఆర్ధిక సర్వే కిక్ ఇచ్చింది. బడ్జెట్ పై అంచనాలతో సోమవారం నాడు లాభాలతో ప్రారంభం అయిన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత మరింత దూసుకెళ్ళాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా ముందు రోజు ఆనవాయితీగా పెట్టే ఆర్ధిక సర్వేను పార్లమెంట్ ముందు ఉంచారు. ఇందులో పేర్కొన్న ప్రగతి రేటు అంచనాలు మార్కెట్ లో జోష్ నింపాయనే చెప్పాలి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు అదే సమయంలో 2022-2023 ఆర్ధిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు.
దీంతో మదుపర్లలో ఉత్సాహం నెలకొంది. వీటికితోడు అంతర్జాతీయంగా కూడా సానుకూల సంకేతాలు అందటంతో ఆద్యంతం లాభాలు వచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 813 పాయింట్ల లాభంతో 58,014.17 పాయింట్ల వద్ద ముగిసింది. కీలక విభాగాలకు చెందిన షేర్లు అన్నీ కూడా లాభపడ్డాయి. అయితే అత్యంత కీలకమైన బడ్జెట్ లో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏ రంగంపై కరుణ చూపిస్తారు.. ఏ రంగంపై శీతకన్ను వేస్తారు అనే దానిపై మార్కెట్ భవిష్యత్ కదలికలు ఉంటాయని భావిస్తున్నారు.