ఈసి పై రాహుల్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసిఐ)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తమ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయని రాహుల్ వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం చెప్పిన చందంగానే ఎన్నికల అక్రమాలకు సంబంధించి పక్కా ఆధారాలతో ఆయన మీడియా ముందు పలు విషయాలు ప్రస్తావించారు. తాను చెపుతున్నది ఎన్నికల సంఘం డేటా ఆధారంగా మాత్రమే అని...ఇది ఏ మాత్రం తన సొంత డేటా కాదు అన్నారు. తాను చెప్పేది తప్పు అయితే అదే విషయం చెప్పాలని ఆయన సవాల్ చేశారు. రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ లో మీడియా సమావేశం నిర్వహించి అధికారంలో ఉన్న పార్టీ, ఎన్నికల సంఘం కలిసి దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అని ఆరోపించారు. దేశంలో అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కి అయినా వ్యతిరేకత ఉంటుంది అని..కానీ బీజేపీ కి మాత్రం అదేమీ ఉండదు అని ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఎన్నికలు వాళ్ళు అనుకున్న విధంగా డిజైన్ చేసుకుంటున్నారు అని ఆరోపించారు. అయితే అధికారంలో ఉన్న పార్టీ పై ప్రజా వ్యతిరేకత లేకపోవటానికి వాళ్ళు చెప్పే కారణాలు రకరకాలుగా ఉంటాయన్నారు.
దేశంలో ఎగ్జిట్ పోల్స్, ఓపీనియన్ పోల్స్ ఒకటి చెబుతాయి, కానీ నిజమైన ఫలితాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఎన్నికల మోసాలకు గురించి చెపుతూ రాహుల్ గాంధీ కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు.మహారాష్ట్ర లో ఐదు నెలల్లోనే 40 లక్షల మంది ఓటర్లు నమోదు అయ్యారు అని...ఐదేళ్లలో నమోదు అయిన వారి కంటే ఈ ఐదు నెలల్లో నమోదు అయినా వాళ్లే ఎక్కువ అన్నారు. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ ఆరు గెలిచినా, మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో మాత్రం భారీ మెజారిటీతో ఓడిపోయిందని చెప్పారు. ఆ సెగ్మెంట్‌లో 1,14,000 ఓట్ల తేడాతో ఓటమి చెందినట్లు చెప్పారు. అందులో 1,00,250 ఓట్లు ఐదు మార్గాల్లో “దొంగిలించబడ్డాయి” అని అన్నారు. వాటిలో 11,965 డూప్లికేట్ ఓటర్లు, 40,009 నకిలీ/చెల్లని చిరునామాలతో ఉన్న ఓటర్లు, 10,452 బల్క్ ఓటర్లు లేదా ఒకే చిరునామాతో ఉన్న ఓటర్లు, 4,132 చెల్లని ఫోటోలతో ఉన్న ఓటర్లు అన్నారు.
వీటి తోపాటు కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం 6ను దుర్వినియోగం చేసిన 33,692 ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. “ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన నేరానికి ఇదే సాక్ష్యం. ఇదే మాదిరి మేము ప్రతి రాష్ట్రంలోనూ చూస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా పెద్దస్థాయిలో జరుగుతున్న నేరమని మాకు స్పష్టంగా తెలుస్తోంది. సిసిటివి ఫుటేజ్, ఓటర్ లిస్ట్ ఇప్పుడు నేరానికి సాక్ష్యంగా మారాయి. ఈసిఐ వాటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తోంది. దేశ ప్రజలకు చెబుతున్నాను – ఈ దేశంలో ఓటింగ్ వ్యవస్థను కేంద్ర బిందువుగా చేసుకుని పెద్ద నేరచర్య జరుగుతోంది. దీనిని ఈసిఐ , అధికార పార్టీ కలిసీ చేస్తూ ఉన్నాయి,” అని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఎన్నికల అక్రమాలకు సంబంధించి తమ దగ్గర ఆటం బాంబు లాంటి సమాచారం ఉంది చెప్పిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ తన మీడియా సమావేశంలో ఎన్నికల అక్రమాలు చోటు చేసుకున్నాయని చెపుతున్న వాళ్ళ పేర్లతో కూడిన డేటా..స్లైడ్స్ వేసి మరీ చూపించారు.
కొంత మంది పేర్లు నాలుగైదు చోట్ల కూడా ఉన్నాయని తెలిపారు. ఆదిత్య శ్రీవాస్తవ అనే ఆయన కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లోని లక్నో, కాన్పూర్, మహారాష్ట్రలో ఓటు వేశారు. ఇలాంటివే 11,000 మంది ఓటర్లు పలు మార్లు ఓటేశారు,” అని తెలిపారు. ఇంకా ఓటర్ల జాబితాలో “హౌస్ నంబర్: జీరో” అని, తండ్రి పేరు అర్థంకాని అక్షరాల రూపంలో ఉన్న ఓటర్ల వివరాలు కూడా చూపించారు. అలాగే 70 ఏళ్ల శకున్ రాణి అనే ఓటరు రెండు సార్లు ఓటర్‌గా నమోదు కావడం, రెండు వేర్వేరు ఫోటోలతో – 2023 సెప్టెంబర్ 13 . 2013 అక్టోబర్ 31 తేదీల్లో, మరియు రెండు సార్లు ఓటు వేసిన ఉదాహరణను కూడా చూపించారు. “ఎన్నికల సంఘానికి చెబుతున్నాను మీరు భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడానికి కాకుండా, దాన్ని రక్షించడానికి ఉన్నారు,” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ఒకే నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో గల పొరపాట్లు కనుగొనడానికి కాంగ్రెస్ పార్టీకి ఆరు నెలల పైగా సమయం పట్టిందని చెప్పారు, ఎందుకంటే జాబితాలు మెషిన్-రీడబుల్ ఫార్మాట్‌లో లేవని అన్నారు. అందుకే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను మెషిన్-రీడబుల్ రూపంలో ఇవ్వాలని, పోలింగ్ బూత్‌ల సిసిటివి ఫుటేజ్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఇందుకు ఈసి సిద్ధంగా లేదు అని తెలిపారు. రాహుల్ గాంధీ ఆరోపణలపై ఈసి స్పందించింది. తాను చెప్పిన విషయాలు నిజం అని నమ్మితే ఒక ప్రమాణ పత్రంతో వాటిని తమకు అందించాలని కోరింది. దీనిపై కూడా రాహుల్ గాంధీ స్పందించారు. ఒక రాజకీయ నాయకుడిగా దేశ ప్రజలు అందరికి తాను బహిరంగంగానే ఈ విషయం చెపుతున్నాను అని..దీన్నే తన ప్రమాణంగా తీసుకోవాలని సూచించారు. తాను చెప్పేది..చూపించింది ఎన్నికల సంఘం డేటా మాత్రమే అని స్పష్టం చేశారు.



