Telugu Gateway
Top Stories

దుబాయ్ కి విమాన సర్వీసులు రద్దు

దుబాయ్ కి విమాన సర్వీసులు రద్దు
X

ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గత 75 సంవత్సరాల్లో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ని చవిచూడలేదు. ఎందుకంటే రెండేళ్లలో కురవాల్సిన వర్షం కేవలం 24 గంటల్లో గుమ్మరించి పోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. తుఫాను తరహా పరిస్థితి తో దుబాయ్ ప్రజలు వణికిపోయారు. అది కూడా మండు వేసవి సమయంలో ఈ తరహా పరిస్థితి ఎదురుకావటం ఎవరూ ఊహించలేదు అనే చెప్పొచ్చు. ఈ దెబ్బ కు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా కొద్ది సేపు మూసివేశారు అంటే వర్షం ప్రభావం ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో దుబాయ్ ఒకటి అన్న విషయం తెలిసిందే. ఎయిర్ పోర్ట్ తో పాటు ప్రధాన హై వే లు కూడా వర్షం దెబ్బకు నీళ్లతో నిండిపోయాయి. మంగళవారం నాడు భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం అయింది.

అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దు అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచే పని చేయటానికి అనుమతించారు. ఈ తుఫాను కారణంగా ఒమాన్ లో ఏకంగా పద్దెనిమిదిమంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. దుబాయ్ లో అత్యంత కీలకమైన దుబాయ్ మాల్, మాల్ అఫ్ ఎమిరేట్స్ ప్రాంతంలో కూడా మోకాలు లోతు నీళ్లు వచ్చి చేరాయి. ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా భారత్-దుబాయ్ ల మధ్య నడవాల్సిన 28 విమాన సర్వీసులు రద్దు అయినట్లు చెపుతున్నారు. అయితే ఆయా ఎయిర్ లైన్స్ తమ తమ ప్రయాణికులకు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ వాళ్ళను అలెర్ట్ చేస్తున్నాయి. మంగళవారం నాడు కురిసిందే దుబాయ్ చరిథ్రలో అతి పెద్ద వర్షం కాగా..బుధవారం నాడు కూడా పిడుగులతో వర్షం కురిసే అవకాశం ఉంది అని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది.

Next Story
Share it