పునర్వవైభం సాధ్యమేనా?!

సంపన్నుల స్వర్గధామం దుబాయ్. దుబాయ్ లో ఉండే ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలు ...అత్యంత సురక్షితమైన ప్రాంతంగా దక్కించుకున్న గుర్తింపుతో ప్రపంచంలోని ఎంతో మంది సంపన్నులు దుబాయ్ కు షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ ఉండే పన్ను రాయితీలు కూడా దీనికి కారణం. ప్రపంచంలో పేరు గాంచిన నగరాలకు చెందిన వాళ్ళు ఎంతో మంది ఇది సేఫ్ ప్లేస్ గా భావించి ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అదే సమయంలో దుబాయ్ లోని రియల్ ఎస్టేట్ తో పాటు వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెట్టారు. దుబాయ్ ని ప్రపంచంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా..పెట్టుబడులకు ఒక హబ్ గా మార్చటంలో అక్కడి పాలకులు విజయవంతం అయ్యారు. అంతే కాదు అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రపంచంలోనే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఒక కీలకమైన హబ్ గా మారిన విషయం తెలిసిందే.
అమెరికాతో పాటు యూరోప్, ఆఫ్రికా లకు కనెక్టింగ్ హబ్ గా ఉంది దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. గత ఏడాది ఇక్కడ నుంచి ఏకంగా 9 కోట్ల మంది కి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించగా...ఈ ఏడాది ఆ సంఖ్య పది కోట్ల కు చేరుతుంది అనే అంచనాలు ఉన్నాయి. అయితే గత 17 రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ లు సంయుక్తంగా ఇరాన్ పై చేస్తున్న యుద్ధం కారణంగా నేరుగా ఈ యుద్ధంతో ఏ మాత్రం సంబంధం లేకపోయినా కూడా దుబాయ్ తో పాటు పలు గల్ఫ్ దేశాలు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఫిబ్రవరి 28 న ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి రెగ్యులర్ షెడ్యూల్ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మధ్యలో కొన్ని సర్వీసులు నడిపినా కూడా అది నామమాత్రంగానే ఉన్న విషయం తెలిసిందే. అమెరికా బేస్ లను అనుమతించడంతో పాటు ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయనే కారణంతోనే ఇరాన్ అటు దుబాయ్ తో పాటు ఇతర గల్ఫ్ దేశాలపై కూడా టార్గెట్ గా దాడులు చేస్తోంది. ముఖ్యంగా అమెరికా బేస్ లతో పాటు ఆ దేశానికీ చెందిన కంపెనీలను టార్గెట్ చేసుకుంటోంది.
యుద్ధం ఇలాగే కొనసాగితే తాము అమెరికా కు సహకరిస్తున్న వాళ్లపై మరిన్ని దాడులు చేస్తామని ఇరాన్ చెపుతోంది. దీంతో ఇప్పుడు దుబాయ్ కి గతంలో ఉన్న సురక్షితమైన ట్యాగ్ పోతుందా అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ యుద్ధం కారణంగా గతంలో ఎన్నడూ లేని రీతిలో దుబాయ్ ఇమేజ్ డ్యామేజ్ అయిన మాట వాస్తవమే అని...అయితే ఇది తాత్కాలికమే అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఈ యుద్ధం ఒక కొలిక్కి వస్తే దుబాయ్ ఎంతో వేగంగా తన ఇమేజ్ ని తిరిగి కాపాడుకునే ప్రయత్నం చేయగలదు అని..ఆ సామర్ధ్యం దుబాయ్ కి ఉంది అని ఎక్కువ మంది చెపుతున్న మాట. ఇరాన్ చేసే దాడులను దుబాయ్ తో పాటు ఇతర గల్ఫ్ దేశాలు సమర్ధవంతంగా అడ్డుకుంటున్నా కూడా కొంత నష్టం జరుగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా బర్త్ డే సెలబ్రేషన్స్, షాపింగ్ కోసం ఎంతో మంది దుబాయ్ వెళ్లిన సందర్భాలు ఎన్నో. అయితే ఇందులో ఎక్కువ మంది సినీ సెలబ్రిటీస్ తో పాటు రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు వంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎక్కువ శాతం పర్యాటకం కోసం దుబాయ్ వెళతారు.
సోమవారం దుబాయ్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఇరాన్ మరో సారి డ్రోన్‌లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో అక్కడ ఉన్న ఇంధన ట్యాంకుకు మంటలు అంటుకుని భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో దుబాయ్ ఎయిర్‌పోర్టు అధికారులు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దుబాయ్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఈ దాడి జరిగినట్టు దుబాయ్ మీడియా కార్యాలయం ధ్రువీకరించింది. ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ లు సంయుక్తంగా చేస్తున్న యుద్దానికి బ్రేక్ పడితే కానీ...దుబాయిలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం లేదు అని చెపుతున్నారు. ఇది ఎన్ని ఎక్కువ రోజులు కొనసాగితే దుబాయ్ తో పాటు గల్ఫ్ లోని పలు నగరాలకు అంత నష్టమే అని చెప్పొచ్చు.



