Telugu Gateway
Top Stories

కరోనాకు మరో మందు

కరోనాకు మరో మందు
X

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు భారత్ లో మరో మందు అందుబాటులోకి వచ్చింది. భారర రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్ డీవో) అభివృద్ధి చేసిన 2 డీజీ (2 డియాక్సి డి గ్లూకోజ్) ను సోమవారం నాడు లాంఛనంగా విడుదల చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ లు ఢిల్లీలో విడుదల చేశారు. ఈ ఔషధం అభివృద్ధిలో దేశంలోని ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ కూడ భాగస్వామిగా ఉంది. ఈ ఔషధాన్ని ఆ సంస్థే తయారు చేస్తోంది. నోటి ద్వారా తీసుకునే 2–డీజీ ఔషధాన్ని ఒక మోస్తరు నుంచి వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న పేషెంట్ల చికిత్సలో వాడటానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఇటీవలే అనుమతించిన విషయం తెలిసిందే.

2 డీజీ ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులు తొందరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని, ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలిందని రక్షణశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చేతుల మీదుగా తొలి బ్యాచ్ ను ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అందుకున్నారు. తొలి విడతలో పది వేల ప్యాకెట్లు అందుబాటులోకి రాగా, మే 27,28తేదీల్లో రెండవ విడత అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ ఔషధం ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Next Story
Share it