Telugu Gateway
Top Stories

అబ్బే నాకు ముందు తెలవదు !

అబ్బే నాకు ముందు తెలవదు !
X

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మాట మార్చటంలో ఏ మాత్రం మొహమాట పడటం లేదు. ఆయన అలవోకగా మాటలు మార్చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి. గతంలో ఏ అమెరికా ప్రెసిడెంట్ కూడా ఇలాగా వ్యవహరించేలేదు అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ మాటలు మారుస్తున్న తీరు చూసి ఆయన విశ్వసనీయత దారుణంగా దెబ్బతింటుంది అనే చర్చ సాగుతోంది. అమెరికా కు మిత్ర దేశం అయిన ఖతార్ విషయంలో కూడా డోనాల్డ్ ట్రంప్ మాట మార్చటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హమాస్ నేతలు టార్గెట్ గా కొద్దిరోజుల క్రితం ఇజ్రాయిల్ ఖతార్ రాజధాని దోహా లో సమావేశం జరుగుతున్న వేళ ఎవరూ ఊహించని స్థాయిలో దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఒక్క సారిగా కలకలం రేపింది.

దోహా లోని టార్గెట్ ప్లేస్ లపై దాడి విషయాన్ని ముందుగానే తాము అమెరికా కు తెలియచేశామని ఇజ్రాయిల్ చెప్పింది. ఈ విషయాన్ని తొలుత వైట్ హౌస్ తో పాటు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కూడా ఒప్పుకున్నారు. కానీ సడన్ గా ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో మాట మార్చారు. ఖతార్ పై దాడుల గురించి తనకు ముందస్తుగా ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు చెప్పలేదు అన్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే ఇజ్రాయిల్ ఇంకోసారి ఖతార్ పై దాడికి పాల్పడదు అని చెప్పుకొచ్చారు. ఇంతకు ముందు మాత్రం ఇజ్రాయిల్ దాడుల కు సంబంధించి తమకు ముందస్తు సమాచారం ఇచ్చింది అని...ఈ విషయాన్ని ఖతార్ కు కూడా తెలియచేశామని ట్రంప్ వెల్లడించారు. అయితే ఖతార్ మాత్రం తమకు అమెరికా నుంచి సమాచారం దాడులు జరిగిన తర్వాత మాత్రమే వచ్చింది అని తెలిపింది.

కాల్పుల విరామమనకు సంబంధించి అమెరికా సూచన మేరకే దోహా లో హమాస్ నేతలు భేటీ అయ్యారు. ఈ చర్చలు సాగుతున్న తరుణంలోనే ఇజ్రాయిల్ దాడులకు పాల్పడింది. ఈ దాడులకు ఖతార్ తీవ్రంగా పరిగణించింది. ఇజ్రాయిల్ కు గట్టి బదులు ఇవ్వటానికి ఇదే సమయం అని కూడా పలు దేశాలు ఇటీవల సమావేశం అయి ఒక నిర్ణయానికి వచ్చాయి. మరో వైపు దాడుల తర్వాత నెతన్యాహుకు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు పంపినట్లు వార్తలు వచ్చాయి. ఖతార్ తమకు ఎంతో నమ్మకమైన మిత్ర దేశం అని..ఆ దేశం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాల్సిందే.


Next Story
Share it