కీలక సమయంలో మోడీని ఇరకాటంలోకి నెట్టిన అమెరికా ప్రెసిడెంట్

అత్యంత కీలక సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకంగా రెండు సార్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ ని తీవ్ర ఇరకాటంలో పడేశారు. ఒక వైపు పదే పదే మోడీ తనకు మంచి ఫ్రెండ్ అని చెపుతూ డోనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరు అధికార బీజేపీ నేతలకు ఏ మాత్రం మింగుడుపడడం లేదు. భారత సైన్యం పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలను..పాక్ లోని కీలక లక్ష్యాలను టార్గెట్ చేసి కొట్టిన వేళ వాతావరణం అంతా భారత్ కు అనుకూలంగా మారిపోయింది. పహల్గాం దారుణానానికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో నిర్వహించిన ఆపరేషన్ ను దేశంలోని త్రివిధ దళాలు అత్యంత విజయవంతంగా పూర్తి చేశాయి. ఆ సమయంలోనే పాకిస్థాన్ ను చావు దెబ్బకొట్టి యుద్దానికి ముగింపు పలుకుతారు అని భావించారు. కానీ సడన్ గా శనివారం సాయంత్రం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్త వాతావరణంపై తాము రాత్రి అంతా చర్చించాం అని ...రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి అంటూ సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇది దేశంలోని చాలా మందిని విస్మయానికి గురి చేసింది. ట్రంప్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే రెండు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించటంతో ఇందులో అమెరికా జోక్యం ఉన్నట్లు తేలిపోయింది అనే చర్చ తెరమీదకు వచ్చింది. దీంతో దేశంలోని ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రధాన పార్టీలు అన్ని కూడా సిమ్లా ఒప్పందాన్ని ఉల్లఘించి భారత్ -పాకిస్థాన్ యుద్ధం విషయంలో థర్డ్ పార్టీ జోక్యాన్ని ఎలా అనుమతించారు అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించాయి. కాల్పుల విరమణతో పాటు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన తదితర అంశలపై చర్చించటానికి ప్రత్యేక పార్లెమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ లు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఇది ఒకటి అయితే...సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు సిద్ధం అయిన సమయంలో ఆయన కంటే కొద్ది సమయం ముందు మళ్ళీ తెరపైకి వచ్చిన అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వెంటనే కాల్పుల విరమణ చేయకపోతే రెండు దేశాలతో వాణిజ్యం ఉండదు అని స్పష్టం చేశానని..దీంతో రెండు దేశాలు వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించాయి అని చెప్పుకొచ్చారు. వాణిజ్యం విషయాన్ని తాను వాడినట్లు ఇతరులు ఎవరూ వాడలేరు అంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. తమ యంత్రంగం రెండు దేశాల మధ్య చర్చలు జరిపి రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఉద్రిక్తలను తగ్గించటంలో కీలక పాత్ర పోషించాయి అన్నారు.
అయితే భారత్ మాత్రం ఈ చర్చల్లో ఎక్కడ వాణిజ్య అంశం ప్రస్తావన లేదు అని చెపుతోంది. ఇలా డోనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ విషయంలో భారత్ అధికారిక ప్రకటన కంటే ముందే ట్వీట్ చేసి..తర్వాత మోడీ ప్రసంగానికి ముందు మరో సారి వాణిజ్య అంశం లేవనెత్తి ప్రధాని మోడీ ని ఇరకాటంలోకి నెట్టారు అనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి. అత్యంత సున్నితమైన భారత్ -పాక్ ల విషయంలో పదే పదే డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు ఎక్కడ తమ కొంప ముంచుతాయో అన్న భయం బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.



