నిపుణుల సూచన ఇదే !

కారణం ఏదైనా స్టాక్ మార్కెట్ లో పెద్ద కరెక్షన్ వచ్చినప్పుడు కొనుగోళ్లు చేయమని చెపుతారు. ఎందుకంటే అలాంటి ఛాన్స్ లు కొన్ని సార్లు మాత్రమే వస్తాయి. అయితే ఈ సూత్రం బాగా డబ్బున్న వాళ్లకు...దీర్ఘకాలం వేచిచూడగలిగే వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ మార్కెట్లలో సృష్టిస్తున్న రక్తపాతం తో నిపుణులు సైతం ఇప్పటికిప్పుడు మార్కెట్ లో కొనుగోలుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని సూచిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇది ఎప్పటికి ఆగుతుంది అనేది ఎవరికీ తెలియటం లేదు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అంత దారుణంగా ఉంటున్నాయి మరి. ట్రంప్ బాధ్యతలు చేపట్టి ఇంకా నిండా మూడు నెలలు కూడా కాకముందే ఆయనకు వ్యతిరేకంగా అమెరికా లో పెద్ద ఎత్తున ధర్నాలు..నిరసనలు సాగుతున్నాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయినా ట్రంప్ మాత్రం అమెరికా మంచి కోసమే తాను నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్తున్నారు.
ట్రంప్ నిర్ణయాల దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ లు వణికిపోతున్నాయి. ఆ ప్రభావం సోమవారం భారతీయ మార్కెట్లపై కూడా పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశీయ మార్కెట్ లలో రక్తపాతం చోటు చేసుకుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశీయ మార్కెట్ లు ఏకంగా 45 లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకు పోయింది. సోమవారం నాడు ప్రారంభం నుంచి మార్కెట్ లు భారీ నష్టాలతోనే మొదలు అయ్యాయి. చివరకు కొద్దిగా కోలుకున్న కూడా భారీ నష్టాలతోనే ముగిశాయి. ఈ దెబ్బకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర 52 వారాల కనిష్ట స్థాయి 1115 రూపాయలకు పతనం అయింది. క్లోజింగ్ లో మాత్రం 38 రూపాయల నష్టంతో 1166 రూపాయల వద్ద ముగిశాయి. టాటా మోటార్స్ షేర్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ షేర్లు కూడా 52 వారాల కనిష్ట స్థాయి 542 రూపాయలకు టచ్ అయ్యాయి. ఫైనల్ గా 34 రూపాయల నష్టంతో 580 రూపాయల వద్ద ముగిసింది.
మొత్తానికి బిఎస్ఈ సెన్సెక్స్ సోమవారం నాడు భారీగా పతనం అయినా చివరకు 2227 పాయింట్ల నష్టంతో 73138 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంత భారీ మొత్తంలో పతనం గత కొన్ని సంవత్సరాల కాలంలో ఇదే మొదటి సారి అని చెప్పాలి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 743 పాయింట్ల నష్టంతో 22161 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. అయినా సరే ఇప్పటికిప్పుడు కొనుగోళ్లు చేయటం తొందరపాటే అవుతుంది అని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. మరికొంతకాలం వేచిచూసి...అది కూడా రిటర్న్స్ కోసం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు వేచిచూడగల వాళ్లే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వటం ఉత్తమం అనేది నిపుణుల మాట. ప్రపంచంలో డోనాల్డ్ ట్రంప్ రేపిన ఈ సుంకాల సునామి ఎంత మందిని ముంచుతుందో రాబోయే రోజుల్లో కానీ తేలదు. అమెరికా విధించిన సుంకాలపై చైనా తీవ్రంగా స్పందిస్తే..భారత్ నుంచి మాత్రం ఆ స్థాయి ప్రతిస్పందన కనిపించలేదు అనే చెప్పాలి. దీనిపై రాజకీయ విమర్శలు కూడా మొదలు అయ్యాయి.