ట్రంప్ టెన్షన్ తో మార్కెట్ లు పతనం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ రెండున ప్రతీకార సుంకాలను సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నారు. ఇండియా తో పాటు పలు దేశాలపై ఈ ప్రభావం పడనుంది. అమెరికా ఉత్పత్తులపై ఎవరు తక్కువ సుంకాలు విధిస్తే తాము కూడా ఆయా దేశాల విషయంలో అలాగే ఉంటామని గత కొన్ని రోజులుగా డోనాల్డ్ ట్రంప్ చెపుతూ వస్తున్నారు. అదే సమయంలో ఆయన ఇండియాలో సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పలు మార్లు విమర్శలు గుప్పించారు. కొద్ది రోజుల క్రితం ఇదే అంశంపై చర్చించటానికి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధికారుల బృందంతో సహా అమెరికాలో పర్యటించి వచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ బెదిరింపుల కారణంగా ఇండియా ఇప్పటికే పలు అమెరికా ఉత్పత్తులపై సుంకాలు గణనీయంగా తగ్గించటానికి సిద్ధం అయింది.
ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా చెపుతూ ఇప్పటి వరకు ఆ పని ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. ట్రంప్ సుంకాల భయంతో మంగళవారం నాడు స్టాక్ మార్కెట్ లు ప్రారంభం నుంచి భారీ నష్టాలతోనే కొనసాగాయి. ఈ వారంలో ట్రంప్ సుంకాల విషయంలో స్పష్టత వస్తుంది. మరో వైపు ఏప్రిల్ 15 తర్వాత నుంచి 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సర ఫలితాలు కూడా వెల్లడి అవుతాయి. సుంకాలపై స్పష్టత, ఆర్థిక ఫలితాలు, 2025 -2026 ఆర్థిక సంవత్సరానికి కంపెనీలు వెల్లడించే గైడెన్స్ వంటి అంశాలు స్టాక్ మార్కెట్ కదలికలను నిర్దేశించే అవకాశం ఉంది.
ట్రంప్ సుంకాల భయంతో మంగళవారం నాడు బిఎస్ఈ సెన్సెక్స్ 1390 పాయింట్లు పతనం అయితే...ఎన్ ఎస్ఈ నిఫ్టీ 737 పాయింట్ల మేర నష్టపోయింది.