Telugu Gateway
Top Stories

ఒక్క ఏడాదిలోనే లక్ష కోట్ల ఐపీఓలు

ఒక్క ఏడాదిలోనే  లక్ష కోట్ల ఐపీఓలు
X

దేశీయ కంపెనీలు ప్రైమరీ మార్కెట్ నుంచి ఒక్క ఏడాదిలోనే లక్ష కోట్ల రూపాయలపైగా నిధులు సమీకరించబోతున్నాయి. ఇప్పటికే 56 ఐపీఓల ద్వారా కంపెనీలు 75384 కోట్ల రూపాయలు సమీకరించాయి. ఇందులో హెచ్ డీబి ఫైనాన్సియల్ సర్వీసెస్, హెక్సావేర్ టెక్నాలజీస్, ఎన్ఎస్ డీఎల్ వంటి పబ్లిక్ ఇష్యూ లు ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు ఏకంగా 25000 కోట్ల రూపాయలకు పైగా సమీకరించాయి. ఈ వారంలో రెండు భారీ ఐపీవో లు మార్కెట్ ముందుకు వస్తున్నాయి. ఇందులో ఒకటి టాటా గ్రూప్ కంపెనీ అయిన టాటా క్యాపిటల్ లిమిటెడ్, రెండవది దక్షిణ కొరియా కు చెందిన ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్. టాటా క్యాపిటల్ ఐపీవో అక్టోబర్ ఆరున మొదలై ఎనిమిదవ తేదీన ముగియనుంది. ఈ కంపెనీ మార్కెట్ నుంచి 15512 రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. టాటా క్యాపిటల్ ఐపీవో దరల శ్రేణిని 310 -326 రూపాయలుగా నిర్ణయించారు. కంపెనీ మొత్తం 21 కోట్ల షేర్లను జారీ చేయనుంది. ఇందులో కొన్ని ఆఫర్ ఫర్ సేల్ షేర్లు ఉంటే...కొన్ని షేర్లను కొత్తగా జారీ చేయనున్నారు. ఈ ఐపీవో లాట్ సైజు ను 46 గా నిర్ణయించారు. ఇష్యూ ముగిసిన తర్వాత అక్టోబర్ 13 న టాటా క్యాపిటల్ షేర్లు బిఎస్ఈ, ఎన్ఎస్ఈ లో నమోదు కానున్నాయి. టాటా క్యాపిటల్ ఐపీవో ఓపెన్ అయిన ఒక్క రోజు గ్యాప్ తో అంటే అక్టోబర్ ఏడున ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ ఇష్యూ ప్రారంభం కానుంది.

ఇది అక్టోబర్ ఏడు నుంచి తొమ్మిది వరకు ఉంటుంది. ఈ కంపెనీ మార్కెట్ నుంచి 11607 కోట్ల రూపాయల సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ ఐపీవో ధరల శ్రేణి 1080 -1140 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ఐపీవో కింద ఇన్వెస్టర్లు ఒక్కో లాట్ కింద 13 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 14 ఎల్ జీ షేర్లు స్టాక్ మార్కెట్ లో నమోదు కాబోతున్నాయి. ఈ రెండు బిగ్ ఐపీవో లే కాకుండా మరి కొన్ని కంపెనీలు కూడా ఐపీవో ల ద్వారా మార్కెట్ నుంచి నిధులు సమీకరించబోతున్నాయి. ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ తో పోలిస్తే టాటా క్యాపిటల్ దరల శ్రేణి చిన్న ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంది అని చెప్పాలి. ధర ఎక్కువ ఉన్న కూడా ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ కూడా ఇన్వెస్టర్లకు మంచి ఛాన్స్ అన్నది మార్కెట్ వర్గాల అభిప్రాయం. ఈ రెండు సంస్థలు ఇన్వెస్టర్లకు లిస్టింగ్ గెయిన్స్ తో పాటు దీర్ఘకాలం హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ ఇస్తాయని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. ఈ రెండు కంపెనీల తో 2025 సంవత్సరంలో మార్కెట్ నుంచి ఐపీఓల ద్వారా సమీకరించిన మొత్తం లక్ష కోట్ల రూపాయలు అధిగమించనుంది.

Next Story
Share it