దేశీయ విమానాల సంఖ్య పెంపునకు అనుమతి
కేంద్ర పౌరవిమానయాన శాఖ దేశీయ విమానాల సంఖ్య పెంచుకోవటానికి అనుమతించింది. కరోనా కంటే ముందు నాటి పరిస్థితుల్లో 72.5 శాతం మేర సర్వీసులు నడుపుకోవటానికి అనుమతించారు. ప్రస్తుతం ఇది 65 శాతమే ఉంది. గత కొంత కాలంగా దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య పెరగటం..పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గినందున ఈ మేరకు సంఖ్య పెంపునకు అనుమతి ఇచ్చారు. జులై 5 నుంచి ఎయిర్ లైన్స్ 65 శాతం సామర్ధ్యంతోనే పనిచేస్తున్నాయి. కరోనా రెండవ దశ కారణంగా జూన్ లో ఈ పరిమితిని 50 శాతానికే కుదించారు.
తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ 72.5 శాతం మేర ఎయిర్ లైన్ సర్వీసులను అనుమతిస్తారు. అయితే అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులపై నిషేధం మాత్రం ఆగస్టు 31 వరకూ కొనసాగుతుందని ప్రకటించారు. ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులు నడుస్తున్నా విమాన టిక్కెట్ దరలు మాత్రం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ముఖ్యంగా విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాతోపాటు లండన్ తదితర మార్గాల్లో టిక్కెట్ ధరలు విపరీతంగాపెరిగిపోయాయి.