Telugu Gateway
Top Stories

వ్యాపారం.. ప్రభుత్వ వ్యవహారం కాదు

వ్యాపారం.. ప్రభుత్వ వ్యవహారం కాదు
X

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అని..వ్యాపారం ప్రభుత్వ వ్యవహారం కాదని ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రభుత్వం పలు సంస్థలు ఏర్పాటు చేయటానికి..ఇప్పటి పరిస్థితులకూ చాలా తేడాలు ఉన్నాయన్నారు. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) నిర్వహించిన వెబినార్‌లో మాట్లాడుతూ ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన 2021-22 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంస్కరణల గురించి తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం తప్పనిసరి అని మోదీ తెలిపారు. 'మానిటైజ్ అండ్ మోడర్నైజ్' అనే మంత్రంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం మోనిటైజ్ (నగదు రూపంలోకి మార్చడం) చేస్తే, ఆ స్థానంలోకి ప్రైవేటు రంగం వస్తుందన్నారు. ప్రైవేటు రంగం వస్తే పెట్టుబడులు వస్తాయని, అత్యుత్తమ స్థాయి అంతర్జాతీయ విధానాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయన్నారు.

వీటి కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఖర్చుపెట్టవలసి వస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేవలం వారసత్వం కొనసాగించడం కోసం నడపకూడదన్నారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు ఆర్థిక సహకారం అందించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోందని చెప్పారు. ప్రైవేటు రంగం వల్ల సమర్థత పెరుగుతుందని, ఉద్యోగావకాశాలు కొత్తగా వస్తాయని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ చేయడం వల్ల వచ్చిన సొమ్మును ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని చెప్పారు. అనేక ప్రభుత్వ ఆస్తులు వాటి సామర్థ్యానికి తగినట్లు పని చేయడం లేదని తెలిపారు. వీటిని మానిటైజ్ చేసి రూ.2.5 లక్షల కోట్లు సేకరిస్తామని చెప్పారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

Next Story
Share it