Telugu Gateway
Top Stories

మాల్ తెరిచారు..19 వేల మంది షాపింగ్ చేశారు

మాల్ తెరిచారు..19 వేల మంది షాపింగ్ చేశారు
X

మ‌ళ్లీ కోవిడ్ బాంబు పేలే వ‌ర‌కూ ఇలాగే చేయండి. త‌ర్వాత ఆస్ప‌త్రులు..ప్ర‌భుత్వాల‌ను తిట్టండి. ఇదీ ఢిల్లీలోని ఓ ప్ర‌ముఖ ఆస్ప‌త్రికి చెందిన వైద్యుడి ఆందోళ‌న‌. క‌రోనా రెండ‌వ ద‌శ కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో రాష్ట్రాలు అన్నీ అన్ లాక్ ప్ర‌క్రియ‌లో ఉన్నాయి. అయితే ఇది ఓ ప‌ద్ద‌తి ప్ర‌కారం జ‌రగాల‌ని లేదంటే మ‌రోసారి ముప్పు త‌ప్ప‌ద‌ని డాక్ట‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు. అన్ లాక్ లో భాగంగా ఢిల్లీలో మాల్స్ ఓపెన్ చేస్తే ఒక్క రోజే 19 వేల మంది షాపింగ్ చేశార‌ని..ఎక్క‌డ చూసినా జ‌నం కిట‌కిట‌లాడుతున్నార‌ని ఓ డాక్ట‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఢిల్లీ లాంటి న‌గ‌రంలో శాస్త్రీయంగా అన్ లాక్ ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. లేక‌పోతే మ‌ళ్లీ ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్నారు. ఢిల్లీలో క‌రోనా కేసులు బాగా త‌గ్గ‌టంతో మెట్రో రైళ్ల‌ను 50 శాతం సామ‌ర్ధ్యంతో, రెస్టారెంట్ల‌ను కూడా అదే స్థాయిలో అనుమ‌తిస్తున్నారు. కొర‌త కార‌ణంగా దేశంలో వ్యాక్సినేష‌న్ కూడా అనుకున్నంత వేగంగా సాగ‌టంలేద‌ని..ఈ ద‌శ‌లో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

రెండ‌వ ద‌శ పీక్ లో ఢిల్లీ ఎంత దారుణ ప‌రిస్థితుల‌ను చూసిందో అంద‌రికీ తెలుస‌ని..అయినా కూడా బాధ్య‌త మ‌రిచి కొంత మంది వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని..తాజా ప‌రిణామాలు ఏ మాత్రం మంచివి కావ‌ని డాక్ట‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఢిల్లీ క్ర‌మ‌క్ర‌మంగా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను ఎత్తేసే ఆలోచ‌న‌లో ఉంద‌ని వీరు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇప్పుడున్న స్థాయిలో జ‌నాలు గుమిగూడితే మాత్రం మ‌రోసారి ఉప‌ద్ర‌వం త‌ప్ప‌ద‌ని డాక్ట‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు. ఖ‌చ్చితంగా భౌతిక‌దూరం పాటిస్తూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ మాత్రం లాక్ డౌన్ స‌డ‌లింపుల వ‌ల్ల కేసులు పెరిగితే మాత్రం మ‌ళ్ళీ క‌ఠిన నిబంధ‌న‌లు విధించ‌టానికి వెన‌కాడ‌బోమ‌ని ప్ర‌క‌టించారు. అయితే మ‌రి ప్ర‌జ‌లు డాక్ట‌ర్లు, నిపుణుల స‌ల‌హాల‌ను పాటిస్తారా లేక మ‌ళ్ళీ ఎప్ప‌టిలాగానే వ్య‌వ‌హ‌రిస్తారా అన్న‌ది వేచిచూడాల్సిందే.

Next Story
Share it