Telugu Gateway
Top Stories

ఏడు కోట్ల అపార్ట్ మెంట్లు 1137 ..మూడు రోజుల్లో అమ్ముడయ్యాయి!

ఏడు కోట్ల అపార్ట్ మెంట్లు 1137 ..మూడు రోజుల్లో అమ్ముడయ్యాయి!
X

ఇది చూసిన వారు ఎవరైనా దేశం లో రియల్ ఎస్టేట్ డల్ అయింది అనే వాళ్ళు ఎక్కడ అని ప్రశ్నించవచ్చు. అదే సమయంలో జనం దగ్గర డబ్బులు లేవన్నది ఎవరు అన్న ప్రశ్న కూడా ఉదయించక మానదు. ఒక వైపు మాంద్యం భయాలు ఉన్నా...మరో వైపు ఐటి రంగంలో పెద్ద ఎత్తున కొలువులు పోతున్నా ఈ స్పీడ్ ఏంటో అన్నది ఎవరికీ అర్థంకావటం లేదు. ఎందుకంటే ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ ప్రకటించిన ఆర్బోర్ ప్రాజెక్ట్ లో 1137 ప్రీమియం అపార్ట్ మెంట్లు కేవలం మూడు అంటే మూడు రోజుల్లోనే అమ్ముడు కావటం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఒక్కొక్కటి ఏడు కోట్ల రూపాయల లెక్కన ఈ ప్రాజెక్ట్ మొత్తం అమ్ముడు పోయింది అంటే సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ పూర్తి అయినట్లు అయింది.

అయితే దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ దగ్గర ఈ ప్రాజెక్ట్ కు ఇంత ఆదరణ లభించటం పెద్ద విశేషం ఏమి కాదు అని కొంత మంది చెపుతుంటే..మరి కొంత మంది మాత్రం కేవలం ఇన్వెస్టర్స్, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాత్రమే పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేశారనే వాదన కూడా తెరమీదకు వచ్చింది. ఏది ఏమైనా ప్రాజెక్ట్ కేవలం మూడు అంటే మూడు రోజుల్లోనే బుక్ అవ్వటం మాత్రం సంచలనంగా మారింది. ఇక్కడి బుకింగ్స్ కోసం డీఎల్ఎఫ్ ఆఫీస్ దగ్గర గుమిగూడిన వారి ఫోటో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అయింది. 25 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టులోని పార్కింగ్ వద్ద ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా రానున్నాయి.

Next Story
Share it