Telugu Gateway
Top Stories

దీపావళి అమ్మకాలు 72 వేల కోట్లు

దీపావళి అమ్మకాలు 72 వేల కోట్లు
X

దేశంలోని ప్రధాన మార్కెట్లలో కలిపి ఈ సారి దీపావళి అమ్మకాలు 72 వేల కోట్ల రూపాయలు జరిగాయని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటి) వెల్లడించింది. చైనా ఉత్పత్తుల బాయ్ కాట్ పిలుపు కారణంగా ఆ దేశానికి సుమారు 40 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. దేశంలోని ప్రధాన 20 నగరాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ మేరకు అంచనాకు వచ్చినట్లు తెలిపారు. పంపిణీ నగరాలు అయిన ఢిల్లీ, ముంబయ్, చెన్నయ్, బెంగుళూరు, హైదరాబాద్, కోల్ కతా, నాగపూర్, రాయ్ పూర్, భువనేశ్వర్, రాంచీ, భోపాల్, లక్నో, కాన్పూర్, నోయిడా, జమ్మూ, అహ్మదాబాద్ , సూరత్, కొచ్చిన్ తదితర ప్రాంతాల నుంచి వివరాలు సేకరించినట్లు తెలిపారు.

దీపావళి పండగ సీజన్ లో అమ్మకాలు ఊపందుకోవటంతో చాలా చోట్ల వ్యాపారుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసిందని తెలిపారు. ఈ సీజన్ లో ముఖ్యంగా ఎఫ్ ఎంసీజీ వస్తువులు, బొమ్మలు, ఎలక్ట్రిక్ ఉపకరణాలు, వైట్ గూడ్స్, కిచెన్ ఆర్టికల్స్, గిఫ్ట్ ఐటెమ్స్, హోమ్ ఫర్నిషింగ్ , బంగారం, జ్యువెలరీ, ఫర్నీచర్ తదితర విభాగాల్లో అమ్మకాలు జోరుగా సాగాయన్నారు.ఈ ఏడాది జూన్ లో ప్రారంభించిన చైనా వస్తువుల బాయ్ కాట్ నినాదంగా బాగానే పనిచేసిందని తెలిపారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడు దేశంలోని పలు విభాగాలు ఒక్కొక్కటి గాడిన పడుతున్నాయి. దీపావళి సీజన్ అమ్మకాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి.

Next Story
Share it