కాక్రోచ్ ల దెబ్బకు దిగొచ్చిన మోడీ:ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

దేశంలోని యువత డిమాండ్ కు కేంద్రంలోని మోడీ సర్కారు దిగి వచ్చింది. ఎట్టకేలకు కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ విషయంలో బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపీ) గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇది దేశ వ్యాప్త ఉద్యమంగా మారే సూచనలు కనిపిస్తుండంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ఇప్పటి వరకు రాజీనామా తప్ప మరేదైనా మాట్లాడతాం అంటూ చెప్పుకొచ్చిన మోడీ సర్కారు ఇప్పుడు ఈ విషయంలో వెనక్కి తగ్గింది. ప్రధాని మోడీ ఆదేశాలు లేకుండా కేంద్ర మంత్రి రాజీనామా చేసే అవకాశం లేదు.
సిజెపీ ప్రతినిధులతో శనివారం మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు మరో సారి భేటీ అవ్వాల్సి ఉండగా...ఈ సమావేశానికి ముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర మంత్రి తన రాజీనామా లేఖను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు అని...యువ శక్తే ఈ దేశ అసలైన శక్తి అని పేర్కొన్నారు. గత పది రోజులుగా జరిగిన ఘటనలు తనను బాధించాయి అని వెల్లడించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం సిజెపీ ప్రజాస్వామ్యం అంటే ఇదే అని స్పందించింది. జంతర్ మంతర్ వద్ద యువత కేంద్ర మంత్రి రాజీనామా ప్రకటన వచ్చిన తర్వాత హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఖచ్చితంగా సిజెపీ తొలి విజయంగా చెప్పొచ్చు.



