స్పైస్ జెట్ కు డీజీసీఏ షాక్
స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ తీరుపై నియంత్రణా సంస్థ అయిన డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనలు 1937 ప్రకారం స్పైస్ జెట్ సురక్షితమైన, సమర్ధవంతమైన..నమ్మకమైక విమాన సర్వీసులు అందించటంలో విఫలమైందని పేర్కొంది. ఈ మేరకు తాజాగా డీజీసీఏ స్పైస్ జెట్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గత పద్దెనిమిది రోజుల వ్యవధిలో స్పైస్ జెట్ విమానాల్లో ఏకంగా ఎనిమిది సంఘటనలు చోటుచేసుకోవటం కలకలం రేపుతోంది. భద్రతా ఉల్లంఘనల పట్ల ప్రయాణికులు కూడా ఈ ఎయిర్ లైన్స్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వరసగా చోటచేసుకుంటున్న ఘటనలపై స్పైస్‌జెట్‌ను పూర్తిస్థాయి వివరణ కోరింది డీజీసీఏ. జూన్ 19న రెండు ఘటనలు, జూన్ 25న ఒకటి, జులై 2న మరోక ఘటనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఢిల్లీ-దుబాయ్ విమానం సాంకేతికలోపంతో కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చైనా వెళుతున్న కార్గో విమానంలో కూడా తీవ్ర సమస్యలు తలెత్తినట్లు గుర్తించి వెనక్కి వచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఎయిర్ లైన్స్ భారీ నష్టాలను చవిచూస్తోంది.