Telugu Gateway
Top Stories

విమానాశ్రయాల్లోనూ మాస్క్ పెట్టుకోకపోతే జరిమానా

విమానాశ్రయాల్లోనూ మాస్క్ పెట్టుకోకపోతే జరిమానా
X

తొలుత విమానాలు. ఇప్పుడు విమానాశ్రయాలు. మాస్క్ తప్పనిసరి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది డీజీసీఏ. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో విమానాశ్రయాల్లో నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మాస్క్ లు పెట్టుకోకుండా..సామాజిక దూరం నిబంధనలను పాటించకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చట్టప్రకారం చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. తమ పరిశీలనలో పలు విమానాశ్రయాల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్లు డీజీసీఏ తాజాగా జారీ చేసిన సర్కులర్ లో పేర్కొంది.

విమానాశ్రయ ఆపరేటర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ప్రయాణికులు అందరూ విధిగా ముక్కు, నోరు కవర్ అయ్యేలా మాస్క్ లు ధరించేలా చూడాలని ఆదేశించింది. నిబంధనల అమలు కోసం విమానాశ్రయాల్లో నిఘాను కూడా మరింత పెంచాలని మంగళవారం నాడు జారీ సర్కులర్ లో పేర్కొన్నారు. డీజీసీఏ అంతకు ముందు ఓ సర్కులర్ జారీ చేసి విమాన ప్రయాణికులు మాస్క్ నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి వారిని నో ఫ్లై జాబితాలో పెట్టాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇఫ్పుడు విమానాశ్రయాల్లోనూ కఠినంగా నిబంధనల అమలుకు నిర్ణయం తీసుకున్నారు.

Next Story
Share it