Telugu Gateway
Top Stories

అదానీ పోర్ట్స్ కు ఆడిటర్ డెలాయిట్ గుడ్ బై !

అదానీ పోర్ట్స్ కు ఆడిటర్  డెలాయిట్ గుడ్ బై !
X

భారత్ లో జెట్ స్పీడ్ లో ఎదిగిన పారిశ్రామికవేత్తల్లో గౌతమ్ అదానీ ఒకరు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక సమయంలో విజయవంతంగా తప్పించుకున్నారు. మరి ఇప్పుడు కూడా తప్పించుకుంటారా?. ఇది కార్పొరేట్ వర్గాల్లో గౌతమ్ అదానీ గురించి ఆసక్తికరంగా సాగుతున్న చర్చ. ఇంత జరుగుతున్నా సెబీ, ఇతర కీలక మంత్రిత్వ శాఖలు ఇప్పుడు కూడా చూసీ చూడనట్లు వదిలేస్తాయా. లేక ఈ సారి అయినా రంగంలోకి దిగి చర్యలు తేసుకుంటాయో లేదో వేచిచుడాల్సిందే. అమెరికా కు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఏవి అయితే అనుమానాలు లేవనెత్తిందో వాటినే అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కంపెనీ ఆడిటింగ్ బాధ్యతలు చూస్తున్న డెలాయిట్ కూడా ప్రస్తావించింది. అంతే కాదు వీటి విషయంలో థర్డ్ పార్టీ, స్వతంత్ర సంస్థలతో ఆడిట్ చేయించాలని కోరగా..ఇందుకు కంపెనీ నో చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ కంపెనీ ఆడిటింగ్ వ్యవహారాలు చూస్తున్న డెలాయిట్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంది అని...దీనిపై సోమవారం నాడే ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని జాతీయ మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ కంపెనీకి సంబంధించిన కొన్ని లావాదేవీలపై డెలాయిట్ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇవే లావాదేవీల గురించి గతంలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కూడా తన నివేదికలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ వైదొలిగేందుకు నిర్ణయించుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అదానీ పోర్ట్స్‌కు సంబంధించి 3 లావాదేవీలపై డెలాయిట్ ఈ సంవత్సరం మే లో కొన్ని అభ్యంతరాలను లేవనెత్తింది. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి సంబంధించిన ఆడిటింగ్ రిపోర్ట్‌లోనే ఈ మూడు లావాదేవీల గురించి ప్రస్తావించింది. తాము కంపెనీ ప్రకటనను ధ్రువీకరించలేమని తెలిపింది.ఈ సంవత్సరం జనవరి 24న.. అమెరికా కు చెందిన షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఒక రిపోర్ట్ బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికతో దేశీయ మార్కెట్లు కుప్ప కులాగా..అదానీ గ్రూప్ షేర్లు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. డెలాయిట్ ను గత ఏడాదే ఐదేళ్ల పాటు అమలులో ఉండేలా చట్ట బద్ద ఆడిటర్ గా నియమించారు. మరి ఇప్పుడు డెలాయిట్ అర్దాంతరంగా తప్పుకోవటం అంటే ఇది కీలక పరిణామంగా కార్పొరేట్ వర్గాలు చెపుతున్నాయి. ఈ వ్యవహారం అదానీ ని చిక్కుల్లో పడేస్తుందా..లేక తెరవెనక ఉండే స్నేహితులు ఎప్పటిలాగానే కాపాడతారా అన్నది చూడాలి.

Next Story
Share it