Telugu Gateway
Top Stories

మే 3 వరకూ ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగింపు

మే 3 వరకూ ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగింపు
X

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. బయటకు రావాలంటేనే వణికిపోయే పరిస్థితి. సాక్ష్యాత్తూ దేశ రాజధానిలో ఆక్సిజన్ అందుకు రోజుకు పదుల సంఖ్యలో ప్రాణాలు వదులుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. దీంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు పెరగడంతో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగించారు. మే 3 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. ఢిల్లీలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదన్నారు. ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో నిన్న రికార్డుస్థాయిలో 357 కరోనా మరణాలు సంభవించాయని కేజ్రీవాల్‌ తెలిపారు.

పలు ఆస్పత్రుల్లో ప్రాణవాయువు నిండుకుంది. దీంతో ఆస్పత్రుల్లో అత్యవసర విభాగాల్లో కృత్రిమ ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్న రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. శుక్రవారం గంగారాం ఆస్పత్రిలో 25 మంది రోగులు ఆక్సిజన్‌ అందక మరణించిన ఘటన మరవకముందే ఢిల్లీలో శనివారం మరో ఘోరం జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్‌ గోల్డెన్‌ ఆస్పత్రిలో 20 మంది రోగులు ఆక్సిజన్‌ అందక కన్నుమూశారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆక్సిజన్ కోసం కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Next Story
Share it