Telugu Gateway
Top Stories

కెసీఆర్ ఢిల్లీ వస్తాడని గజగజ వణుకుతున్నారు

కెసీఆర్ ఢిల్లీ వస్తాడని గజగజ వణుకుతున్నారు
X

మంత్రాంగాలు జరుగుతున్నాయి ఢిల్లీలో

అందుకే వరదలా..బురదలా వస్తున్నారు

బక్క కెసీఆర్ ను కొట్టడానికి ఇంత మంది కావాలా?

బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పది వేలు ఇచ్చారా కొడుకులు

హైదరాబాద్ కు ఏటా బడ్జెట్ లో పది వేల కోట్లు

ఎల్బీ స్టేడియం బహిరంగ సభలో సీఎం కెసీఆర్

దేశంలో కొత్త తరహా, కొత్త పంథా రాజకీయం రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యాఖ్యానించారు. తాను ఎక్కడ వస్తానో అని..ఢిల్లీలో గజ గజ వణుకుతున్నారని..మంత్రాంగాలు జరుపుతున్నారని తెలిపారు. తనను ఇక్కడే ఆగబట్టాలని, వరదలా..బురదలా హైదరాబాద్ కు వస్తున్నారని బిజెపి నాయకులనుద్దేశించి వ్యాఖ్యానించారు. బక్క కెసీఆర్ ను కొట్టడానికి ఇంత మంది రావాలా అని ప్రశ్నించారు. కెసీఆర్ శనివారం సాయంత్రం ఎల్ బీ స్టేడియంలో నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. దేశంలో వరదలతో మునగని నగరమే లేదని ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కూడా తాజాగా వరదల్లో మునిగిందని..ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు. తనను ఎవరూ అడగకపోయినా..ధర్నాలు చేయకపోయినా పేదల కష్టాలను చూసి కుటుంబానికి పది వేల రూపాయల సాయం ప్రకటించానన్నారు. బెంగుళూరు, అహ్మదాబాద్, చెన్నయ్, ముంబయ్ తదితర నగరాల్లో కూడా వరదలు వచ్చాయని..అక్కడ బిజెపి, కాంగ్రెస్ నాకొడుకులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. బాధతో ఈ మాట అంటున్నానని..ఇక్కడ మాత్రం కిరికిరి పెడుతున్నారని విమర్శించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను మంచి మెజారిటీతో గెలిస్తే వచ్చే బడ్జెట్ నుంచి ఏటా పది వేల కోట్ల రూపాయలు పెట్టి నగరాన్ని సమస్యలు లేకుండా తీర్చిదిద్దుతామని తెలిపారు. తమది కొందరి కోసం పనిచేసే పార్టీకాదని..అందరి కోసం పనిచేస్తామన్నారు. నగరాన్ని బాగుచేయాలనే తాము ముందుకెళుతున్నామని..గెలిపించి సహకరించాలని కోరారు. ఎవరో తలకుమాసినోడు ఏధో మాట్లాడానని టీఆర్ఎస్ పట్టించుకోదని..టీఆర్ఎస్ ఈ ఆరేళ్ళలో ఎన్నో చేసి చూపించిందని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని రీతిలో వరద బాధితులకు 650 కోట్లు ఇచ్చిన సర్కారు తమదే అన్నారు. ఒకడు ఉత్తరం రాస్తాడు..నేను రాయలేదంటాడు. ఈసీని ఇబ్బంది పెట్టి ఆపారు. డిసెంబర్ ఏడు తర్వాత ఎంత మంది అర్హులు ఉంటే అంతమందికి సాయం చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో అందమైన మూసీని, చిరునవ్వుల హైదరాబాద్ ను చూపిస్తామని వ్యాఖ్యానించారు. సీసీకెమెరాల ఏర్పాటులో దేశంలో హైదరాబాద్ ముందు ఉందన్నారు. ప్రధానిని తాను వరద సాయం కోసం 1350 కోట్ల రూపాయలు అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదన్నారు.

మేం బారతదేశంలో లేమా?. బెంగుళూరు, అహ్మదాబాద్ కు ఇచ్చారు కదా?. ఎందుకు వివక్ష్ అని ప్రశ్నించారు. ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలో నిర్ణయం చేయాలన్నారు. కెసీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...'జీహెచ్ఎంసీ ఎన్నికలా? జాతీయ ఎన్నికలా? ఏమి జరుగుతుంది కథ. రెండు జాతీయ పార్టీలు దేశాన్ని నడపటంలో ఫెయిల్ అయ్యాయి. దేశం కోసం ప్రజల కోసం మాట్లాడతాం తప్ప మరొకటి కాదు. ఎల్ఐసిని ఎందుకు అమ్ముతున్నారు? అంటే అది మాట్లాడొద్దట. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి వచ్చాడు. ఆయన ఠికానే సక్కగా లేదు. తలసరి ఆదాయంలో ఆయన ర్యాంక్ 28. తెలంగాణ ర్యాంక్ 5. 28వ ర్యాంక్ వాడు వచ్చి 5 వ ర్యాంకు వాడికి చెబుతాడు అంట. టీఆర్ఎస్ ఫైట్ చేస్తది. దేశాన్ని ఏకం చేస్తది. నగరాన్ని కాపాడాలి. వంచకుల మాటలు విని మోసపోవద్దు. మహారాష్ట్ర వాడు..ఉత్తరప్రదేశ్ వాడు నాలుగు మాటలు చెప్పి పోతాడు తప్ప..వాడికి నెత్తి కాదు...కత్తికాదు. ఏమి చేసినా మేమే చేయాలి.

తేడా వస్తే మొత్తం భూముల విలువలు పోతాయి. ఆస్తుల విలువ తగ్గుతుంది. వ్యాపారాలు పోతాం. ఆ పరిస్థితికి పోవద్దు. జాగ్రత్తగా ఉండాలి. అందరూ చిరునవ్వుతో ఉండాలి. జీహెచ్ఎంసీలో అందరూ మంచివాళ్లను పెట్టాం. సేవా భావం ఉన్న వారిని పెట్టాం. పోయిన సారి కంటే ఏకపక్షంగా ఐదారు సీట్లు ఎక్కువ ఇచ్చి గెలిపించండి. నగరాన్ని అబివృద్ధి చేస్తాం. ఎవరు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నా. నన్ను కూడా రారా పోరా అంటున్నారు. నేను తలచుకున్నప్పుడు నసం కింద కొడతా బిడ్డా. మా బాస్ లు ఢిల్లీలో ఉండరు. ప్రజలే బా బాస్ లు. ఇద్దరు ముగ్గురు మాట్లాడే మాటలకు మేం టెంప్ట్ కాం. ' అని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథను విజయవంతం చేశామని..చేయలేకపోతే ఓట్లు అడగం అని చెప్పి పూర్తి చేసిన మగతనం ఉన్న పార్టీ తమది అన్నారు. తాజాగా ప్రకటించిన 20 వేల లీటర్ల ఉచిత మంచినీటిని అపార్ట్ మెంట్లకు కూడా వర్తింపచేయనున్నట్లు తెలిపారు. నగరంలో 24 గంటల పాటు మంచినీళ్ళు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

Next Story
Share it