Telugu Gateway
Top Stories

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?!

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?!
X

జీఎంఆర్ నిర్వహణలో ఉన్న ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకే రోజు రెండు రికార్డు లు నమోదు చేసింది. ఇందులో ఒకటి ఈ విమానాశ్రయంలో నాల్గవ రన్ వే అందుబాటులోకి రావటం. దేశంలో నాలుగు రన్ వేలు ఉన్న ఏకైక ఎయిర్ పోర్ట్ ఇదే. దీంతో పాటు ఇక్కడే ఎలివేటెడ్ క్రాస్ టాక్సీ వే ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత విమానం నుంచి బయటకు రావటానికి ప్రయాణికులు ఎదురు చూసే సమయం గణనీయంగా తగ్గనుంది. అదే సమయంలో విమానాల రాకపోకలు మరింత మెరుగు కానున్నాయి. 2 .1 కిలోమీటర్ల నిడివి తో కూడిన రెండు వైపులా ఉండే ఈ ఎలివేటెడ్ క్రాస్ టాక్సీ వే కూడా దేశంలోనే మొదటిది కావటం మరో విశేషం. కోడ్ ఎఫ్ సామర్థ్యంతో వీటిని నిర్మించారు. అంటే భారీ భారీ విమానాలు కూడా ఇక్కడ సురక్షితంగా వెళ్లగలవు. ఈ ఎలివేటెడ్ క్రాస్ టాక్సీ వే ని విమానాశ్రయంలోని ఉత్తర, దక్షిణ ఎయిర్ ఫీల్డ్స్ ను తూర్పు వైపు అనుసంధానం చేయనున్నారు.

ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానం ఇప్పుడు టెర్మినల్ వన్ కు చేరుకోవాలంటే 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఎలివేటెడ్ క్రాస్ టాక్సీ వే తో విమానాలు పది నిమిషాల్లోనే టెర్మినల్ త్రీ నుంచి ఒకటికి వెళ్లగలవు. అదే సమయంలో దూరం కూడా తొమ్మిది కిలోమీటర్ల నుంచి రెండు కిలోమీటర్లకు తగ్గుతుంది. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవటంతో విమానాల ల్యాండింగ్, టేక్ ఆఫ్ ల వేగం కూడా పెరుగుతుంది. అంతే కాకుండా దీనివల్ల పర్యావరణ పరంగా చూసుకుంటే ఏటా 55 వేల టన్నుల కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గించవచ్చు అని ప్రకటించారు. ప్రస్తుతం ఈ విమానాశ్రయంలో రోజూ 1500 విమానాలు రాకపోకలు సాగిస్తుండగా...త్వరలోనే ఈ సంఖ్య రెండు వేలకు పెరగనుంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఇప్పుడు మూడు టెర్మినళ్లు, నాలుగు రన్ వే లు ఉన్నాయి. ఏటా ఢిల్లీ నుంచి ప్రయాణించే వారి సంఖ్య త్వరలోనే పదకొండు కోట్లకు చేరే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏటా ఏడు కోట్ల మంది ప్రయాణిస్తున్నారు.

Next Story
Share it