కోవిషీల్డ్..కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్లకు అనుమతి మంజూరు
కరోనాపై పోరు తుది దశకు చేరుకుంది. భారత్ లో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సీరమ్ కు చెందిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కు చెందిన కోవ్యాగ్జిన్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వీటి అత్యవసర వాడకానికి మాత్రమే అనుమతి మంజూరు చేశారు. కోవాగ్జిన్‌ను పూర్తిగా దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా.. కోవిషీల్డ్ ను ఆక్స్ ఫర్డ్, అస్త్రాజెనకా, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కలిసి అభివృద్ధి చేశాయి. ఈ సందర్భంగా డీసీజీఐ డైరెక్టర్ విజి సోమాని మాట్లాడుతూ.. కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది.
నిపుణుల కమిటీ అన్ని అంశాలు పరిశీలించాకే రెండు వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి ఇచ్చిందని తెలిపారు. డిసీజీఐ అనుమతితో మరో వారం రోజుల్లోనే భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డీజీసీఐ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ అభివృద్దికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు తెలిపారు. కోవ్యాగ్జిన్ మూడవ దశ ప్రయోగాలు ఇంకా పూర్తి కాకుండానే దీనికి అనుమతి ఇవ్వటంపై రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ అనుమతిని తప్పుపట్టింది. దీనిపై బిజెపి ఎదురుదాడి ప్రారంభించింది. వ్యాక్సిన్ విషయంలో రాజకీయాలా అంటూ మండిపడుతోంది.