పైజర్..మోడెర్నా వ్యాక్సిన్ల ఎంట్రీకి భారత్ గ్రీన్ సిగ్నల్
కీలక పరిణామం. దేశంలో వ్యాక్సిన్ల కొరత తీరేందుకు ఒకింత మార్గం సుగమం అయింది. విదేశీ వ్యాక్సిన్లు దేశంలోకి అనుమతించేందు వీలుగా కీలక అడుగు పడింది. ఎప్పటి నుంచో దీనికి సంబంధించి ప్రయత్నాలు సాగుతున్నాయి. వాస్తవానికి ఇప్పటివరకూ దేశంలో వ్యాక్సిన్లను అనుమతించాలంటే ఇక్కడ కూడా పలు దశల ప్రయోగాలు చేసిన తర్వాత ఆమోదం తెలుపుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం అందుకు మినహాయింపు కల్పించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో ) ఆమోదముద్ర వేసిన వ్యాక్సిన్లను దేశంలోకి నేరుగా అనుమతించనున్నారు. ఈ మేరకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మార్పులు చేసింది. ఇప్పటివరకూ ఉన్న ఆంక్షలను సవరించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో )ఆమోదించిన అన్ని టీకాలకు దేశంలోకి అనుమతించాలని నిర్ణయించారు . ఇప్పటికే వివిధ దేశాలు, డబ్ల్యూహెచ్‌వో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన వ్యాక్సిన్లకు ఇండియాలో మళ్లీ ట్రయల్స్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఫైజర్, మోడెర్నాలాంటి విదేశీ కంపెనీల వ్యాక్సిన్లకు ఇండియాలో మార్గం సుగమం చేసింది. దేశంలో వ్యాక్సిన్ల భారీ డిమాండ్, కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీసీజీఐ చీఫ్ వీజీ సోమానీ వెల్లడించారు. కోవిడ్-19 వ్యాక్సిన్‌ల కోసం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం డీసీజీఐకి ఈ సిఫారసు చేసింది.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది తీసుకున్న వ్యాక్సిన్లు, యూఎస్ ఎఫ్‌డీఏ, ఈఎంఏ, యూకే ఎంహెచ్ఆర్ఏ, పీఎండీఏ, జపాన్ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ యూజ్ లిస్ట్‌లో ఉన్న వ్యాక్సిన్లకు ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని నిర్ణయించినట్లు సోమానీ ఒక లేఖలో తెలిపారు. గతంలో విదేశాల్లో ట్రయల్స్ పూర్తి చేసి అనుమతి పొందిన వ్యాక్సిన్లు కూడా ఇండియాలో బ్రిడ్జింగ్ ట్రయల్స్ లేదా పరిమిత స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడా నిబంధనను ఎత్తివేశారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉన్నందున ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు భారత్‌కు చేరడానికి కొంత సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. జూలై , అక్టోబర్ మధ్య భారతదేశానికి 5 కోట్ల మోతాదులను అందించడానికి ఫైజర్ సిద్దంగా ఉన్నట్లు గతంలో ప్రకటించింది. కేంద్ర తాజా నిర్ణయంతో మరి ఎంత వేగంగా దేశంలో అమెరికా కంపెనీల వ్యాక్సిన్లు వస్తాయో వేచిచూడాల్సిందే.