Telugu Gateway
Top Stories

సంచ‌ల‌నం...ఆ ఫోన్ల‌లో పెగాసెస్ స్పైవేర్ నిజ‌మే

సంచ‌ల‌నం...ఆ ఫోన్ల‌లో పెగాసెస్ స్పైవేర్ నిజ‌మే
X

సైబ‌ర్ నిపుణుల నిర్ధార‌ణ‌..యాపిల్..ఆండ్రాయిడ్ ఫోన్ల‌లోనూ

ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ సంచ‌ల‌న క‌థ‌నం

పెగాసెస్ స్పైవేర్ కు సంబంధించి తాజాగా న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన క‌థ‌నం దేశంలో మ‌రోమారు సంచ‌ల‌నం రేపింది. 2017లోనే కేంద్రం ఈ స్పైవేర్ ను కేంద్రం కొనుగోలుచేసింద‌ని..ర‌క్షణ ఒప్పందంలో కూడా ఇది ఓ భాగం అని స్ప‌ష్టం చేసింది. ఏడాది పాటు ప‌రిశోధ‌న చేసి ఈ విష‌యాలు వెలుగులోకి తెచ్చిన‌ట్లు పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ తోపాటు ఇత‌ర ప్ర‌తిప‌క్ష పార్టీలు మండిప‌డుతున్నాయి. పార్ల‌మెంట్ ను..సుప్రీంకోర్టును త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. దేశ ప్ర‌జ‌ల‌పై కేంద్రం నిఘా పెట్ట‌డం దారుణం అంటూ వ్యాఖ్య‌లు చేస్తున్నాయి. ఈ తరుణంలో ద ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ మ‌రో సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఫిర్యాదుదారుల ఫోన్ల‌లో పెగాసెస్ స్పైవేర్ కు సంబంధించిన మాల్ వేర్ ను సైబ‌ర్ నిపుణులు గుర్తించిన‌ట్లు సుప్రీంకోర్టు నియ‌మించిన నిపుణుల క‌మిటీకి తేల్చిచెప్పినట్లు ఆ క‌థ‌నం పేర్కొంది. దీంతో వ్య‌వ‌హారం మ‌రో మ‌లుపు తిరిగిన‌ట్లు అయింది. ఇద్ద‌రు సైబ‌ర్ సెక్యూరిటీ ప‌రిశోధ‌కులు సుప్రీంకోర్టు నియ‌మించిన క‌మిటీ ముందు హాజ‌రై పిటీష‌న‌ర్ల ఫోన్ల‌లో ఖ‌చ్చితంగా స్పైవేర్ ఉన్న‌ట్లు ఖ‌చ్చిత‌మైన నిర్ధార‌ణ జ‌రిగిన‌ట్లు తెలిపారు. అంతే కాదు వారు నిర్వ‌హించిన ఫోరెన్సిక్ విశ్లేష‌ణ‌ నివేదిక‌ను కూడా క‌మిటీకి అంద‌జేశారు. ఈ ఇద్ద‌రు సైబ‌ర్ నిపుణులు మొత్తం ఏడుగురికి చెందిన ఐఫోన్ల‌ను ప‌రిశీలించ‌గా..అందులో ఇద్ద‌రి ఫోన్ల‌లో ఈ పెగాసెస్ స్పైవేర్ వాడిన ఆధారాలు ఉన్న‌ట్లు కనుగొన్నామ‌ని ఒక‌రు ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ కు తెలిపార‌ని క‌థ‌నంలో ప్ర‌స్తావించారు.

ఈ ప‌రిశోధ‌కులు సుప్రీంకోర్టుకు అఫిడ‌విట్ రూపంలో స‌మాచారం ఇవ్వ‌టంతోపాటు క‌మిటీ ముందు కూడా హాజ‌రై ప‌లు విష‌యాలు వెల్ల‌డించార‌న్నారు. ఒక ఫోన్ లో 2018 ఏప్రిల్ లో ఈ పెగాసెస్ స్పైవే ప్ర‌వేశించ‌గా..రెండ‌వ ఫోన్ లో మాత్రం 2021 జూన్-జులై మ‌ధ్య కాలంలో ప‌లుమార్లు స్పైవేర్ ను ప్ర‌వేశపెట్టిన‌ట్లు తెలిపారు. అంతే కాదు...2021 మార్చి ముందు విష‌యాల‌ను ప‌రిశీలిస్తే ఈ స్పైవేర్ వాడిన విష‌యాన్ని కూడా డిలీట్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు ఒక నిపుణుడు తెలిపారు. యాపిల్ ఫోన్ల‌ను ఒక‌రు విశ్లేషించ‌గా..ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను మ‌రో నిపుణుడు విశ్లేషించారు. ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను విశ్లేషించిన నిపుణుడు మొత్తం ఆరు ఫోన్ల‌ను చూడ‌గా..అందులో నాలుగింటిలో పెగాసెస్ స్పైవేర్ వాడిన విష‌యం నిర్ధార‌ణ అయింది. ఓ వైపు సైబ‌ర్ నిపుణుల నిర్ధార‌ణ‌, మ‌రో వైపు న్యూయార్క్ టైమ్స్ క‌థ‌నంతో పెగాసెస్ స్పైవేర్ మ‌రోసారి దేశంలో రాజ‌కీయ దుమారం రేప‌టం ఖాయంగా క‌న్పిస్తోంది. ఇదిలా ఉంటే అత్యంత కీల‌క‌మైన ఈ విష‌యంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండ‌బోతున్న‌ది కూడా అత్యంత కీల‌కంగా మారింది.

Next Story
Share it