థర్డ్ వేవ్..పిల్లలపై ప్రభావానికి ఆధారాల్లేవ్
గత కొద్ది రోజులుగా నిపుణులు కరోనా థర్డ్ వేవ్ గురించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా ఎస్ బిఐ పరిశోధనా నివేదిక కూడా సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉంటుందని అంచనా వేసింది. అంతే కాదు..ఇది గరిష్టంగా 98 రోజుల వరకూ ఉంటుందని లెక్కలు గట్టింది. కొంత మంది మాత్రం ఇది పిల్లలపై ప్రభావం చూపిస్తుందని చెబుతుంటే..మరికొంత మంది మాత్రం దీనికి ఎలాంటి ఆధారాలు లేవని వాదిస్తున్నారు. తాజాగా దీనిపై ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా మరింత స్పష్టత ఇచ్చారు.మూడో దశ పిల్లలపై ప్రత్యేకంగా ప్రభావం చూపుతుందనడంపై స్పష్టత లేదని కోవిడ్ నివారణ కమిటీ సభ్యులు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ఆధారంగా సీరో ప్రివలెన్స్ రేటు అదే విషయాన్ని వెల్లడి చేసిందన్నారు. అలాగే రానున్న దశలో వారికి అధికంగా ఈ వైరస్ సోకుతుందని రుజువు చేసే ఆధారాలు లేవని గులేరియా పేర్కొన్నారు. మరోపక్క కరోనా టీకాపై ఉన్న అనుమానాలను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. అలానే ఫస్ట్, సెకండ్ వేవ్‌లో కరోనా బారిన పడిన పిల్లల్లో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరలేదని.. ఇంటి వద్దనే కోలుకున్నారని గులేరియా తెలిపారు. పెద్దలు టీకాలు వేసుకుంటే పిల్లలకు వైరస్ సోకే అవకాశం చాలామటుకు తగ్గిపోతుందని తెలుస్తోంది. అలాగే పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేనందున తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయొద్దని ఇండియన్ పీడియాట్రిక్ అసోసియేషన్ కోరింది.
తదుపరి దశలో పసిపిల్లలో తీవ్ర లక్షణాలు ఉండొచ్చనే వాదనను నిపుణులు తోసిపుచ్చారు. రెండు దశల్లో భాగంగా సేకరించిన వివరాల ప్రకారం కొద్దిశాతం మందికి మాత్రమే తీవ్ర లక్షణాలు కనిపిస్తాయిని సూచిస్తున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనుందన్న హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రులు పిల్లల సంరక్షణ కోసం సౌకర్యాలను పెంచడం ప్రారంభించాయి. వాక్సినేషన్‌లో భాగంగా ఐదేళ్ల లోపు పిల్లల తల్లులకు సాధ్యమైనంత త్వరగా టీకాలు వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. గత కొద్ది రోజులుగా ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసిన కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఏప్రిల్, మే నెలలో తీవ్ర స్థాయిలో ఉన్న కరోనా కేసులు జూన్ మొదటి వారంలో లక్షకు దిగువన నమోదు అయ్యాయి. అయితే ఇప్పటి వరకు మహమ్మారి చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపలేదు.