కోవిడ్ కథ ముగిసినట్లే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తీపికబురు వచ్చేసింది. ఇక కోవిడ్ కథ ముగిసినట్లే. అయితే ఇక అది కేవలం ఓ ఫ్లూలాగా..సీజనల్ వ్యాధిలాగా మారిపోయినట్లే అని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ తన తాజా సంపాదకీయంలో ప్రస్తావించింది. కోవిడ్ ఎండెమిక్ గా మారిపోయినట్లేనని..అయితే ఇది పూర్తిగా పోయినట్లు మాత్రం కాదని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సికేషన్ ప్రక్రియ ఊపందుకోవటం కూడా ఇందుకు దోహదం చేసినట్లు పేర్కొంది. ఎక్కడైతే వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా జరిగిందో అక్కడ కోవిడ్ తీవ్రతతోపాటు మరణాలు కూడా పరిమితంగా ఉన్నట్లు పలు పరిశోధనల్లో గుర్తించినట్లు వెల్లడించారు. గత రెండేళ్ళుగా ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ కారణంగా వైద్య రంగంలోని నిపుణులు అందరూ మిగతా అంశాలను వదిలేసి..కోవిడ్ కు చెందిన వేరియంట్ల..దీని ప్రభావంపైనే పరిశోధనా పత్రాలు సిద్ధం చేశారు. ఇప్పుడు కోవిడ్ కథ ముగిసినందున అత్యంత కీలకమైన ఇతర సమస్యలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని లాన్సెట్ అభిప్రాయపడింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇప్పుడు కోవిడ్ ను ఎదుర్కొనే శక్తిని పొందారని పేర్కొన్నారు. భారత్ లో అయితే ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా తగ్గుముఖం పట్టింది. తొలి రెండు దశలతో పోలిస్తే మూడవ దశ చాలా పరిమిత ప్రభావం చూపించటంతోపాటు త్వరగా రికవరికి ఛాన్స్ కల్పించింది. అయితే మరణాలు మాత్రం కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నమోదు కావటం ఒకింత ఆందోళనకర అంశంగా మారింది. భారత్ లో కోవిడ్ ముగిసినట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో నమోదు అయిన కేసులు 30 వేల దిగువన 27409కి పరిమితం అయ్యాయి. మరణాలు కూడా 347గా నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4, 23,127గా ఉన్నాయి. ఈ నెలాఖరులోపే ఇవి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.