కరోనా దెబ్బ..20 శాతం విమానాలను రద్దు చేసిన ఇండిగో
కరోనా ప్రభావం మరోసారి విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా కీలక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో అత్యవసరం అయితే తప్ప చాలా మంది ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. దీంతో విమాన సర్వీసులపై ప్రభావం పడుతోంది. దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగో తాజాగా 20 శాతం సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉన్న సర్వీసుల్లోనూ మరీ తక్కువగా ప్రయాణికులు ఉంటే వాటిని కూడా రద్దు చేస్తామని..ప్రయాణికులను తర్వాత సర్వీసులకు సర్దుబాటు చేస్తామని వెల్లడించింది.
అయితే ఈ కరోనా సమయంలో ప్రయాణికులు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే తమ ప్రయాణ తేదీని మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఎయిర్ లైన్ వెల్లడించింది. ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి..జనవరి 31 వరకూ బుక్ చేసుకునే వారికి కూడా ఈ వెసులుబాటు వర్తిలిస్తుంది. మార్చి 31 వరకూ ఉండే ప్రయాణ తేదీలను మార్చుకునే అవకాశం కల్పించారు. అయితే విమానాల రద్దు 72 గంటల ముందు ఉంటుందని తెలిపింది. ప్రయాణికులు భారీ ఎత్తున తమ ప్రణాళికలను మార్చుకుంటున్నారు.