కొత్త రకం వైరస్ లనూ అడ్డుకుంటున్న కొవాగ్జిన్
గుడ్ న్యూస్. కరోనా వైరస్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ సవాళ్లు విసురుతోంది. అయితే ఇప్పటికే సిద్ధం అయిన వ్యాక్సిన్లు ఈ మారుతున్న వైరస్ ల నుంచి రక్షణ కల్పిస్తాయా లేదా అన్న అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఇండియన్ కౌన్సిల్ ఫార్ మెడికల్ రీసెర్చి(ఐసీఎంఆర్) బుధవారం నాడు కీలక ప్రకటన చేసింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది. కొవాగ్జిన్ విజయవంతంగా యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రకం వైరస్‌లను బంధించి కల్చర్ చేసినట్లు పేర్కొంది. ఇటీవలే భారత్‌లో కనిపిస్తున్న డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్లను కూడా కొవాగ్జిన్ నిలువరిస్తోందని పేర్కొంది.
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా ఇన్ఫెక్షన్లు వస్తే భయపడాల్సిన పనిలేదని భారత్ బయోటెక్ ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు. ఇంజెక్షన్ రూపంలో తీసుకునే వ్యాక్సిన్ ఊపిరితిత్తుల కింద భాగాన్ని కాపాడుతుందని తెలిపారు. అదే సమయంలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ లు ధరిస్తూ ఇతర జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైరస్ వచ్చినా కూడా ఏ మాత్రం ప్రమాదం ఉండదన్నారు. వ్యాక్సిన్ బాధితులకు ప్రాణాంతకంగా మారకుండా కాపాడుతుందని తెలిపారు. తాజాగా వచ్చిన ఫలితాల్లో కొవాగ్జిన్ సమర్ధత విషయంలో మంచి ఫలితాలను వెల్లడించింది.