కరోనా మూడవ వేవ్ తప్పదు
దేశాన్ని ఇప్పుడు కరోనా రెండవ దశ వణికిస్తోంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు డాక్టర్ కె. విజయరాఘవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో కరోనా మూడవ వేవ్ తప్పదన్నారు. అయితే అది ఎప్పుడు..ఎలా వస్తుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. థర్డ్ వేవ్ నాటికి వైరస్ మరింతగా మారవచ్చని, భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఎక్కువని తెలిపారు. కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్ తయారు చేసుకోవాలని విజయరాఘవన్ సూచించారు.
అయితే ప్రస్తుత వేరియంట్లపై వ్యాక్సిన్ బాగా పని చేస్తోందని తెలిపారు. దేశంలో మహమ్మారి అంతానికి, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కోనేందుకు టీకాల పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని విజయరాఘవన్ హెచ్చరించారు. ఈ వైరస్ అధిక స్థాయిలో విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.