ఓడించటమే కాదు..ఉనికి కూడా లేకుండా చేయాలా!

రాజ్య సభ లో ఆప్ కథను అలా ముగించారు. ఇప్పడు మొన్నటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దారుణంగా ఓటమి చవిచూసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టిఎంసి) ఉనికే లేకుండా చేసేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ ఎంపీల్లో చీలికకు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఎంపీ సీఎం రమేష్ కీలక పాత్ర పోషించినట్లు మీడియా లో కూడా వార్తలు వచ్చాయి. పైకి కనిపించేది కొంత మంది అయినా తెరవెనక ఎలాగూ బీజేపీ పెద్దలు ఉండనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో టిఎంసి తరపున 80 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. పార్టీ ఓటమి పాలు అయిన తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేసి రితబ్రత బందోపాధ్యాయ్ తమ పక్ష నాయకుడిగా స్పీకర్ కు లేఖ ఇవ్వటం..స్పీకర్ గుర్తించటం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి సీన్ ఢిల్లీ కి మారింది. లోక్ సభలో టిఎంసి 28 మంది ఎంపీలు ఉంటే...ఇటీవల 20 మంది ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరేసి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నట్లు స్పీకర్ కు లేఖ ఇచ్చారు. దీంతో అటు ఎమ్మెల్యేలే కాదు...ఎంపీలు కూడా పార్టీ వీడటానికి సిద్ధం అయ్యారు.
మరో వైపు ఇప్పటికే టిఎంసి కి చెందిన ఇద్దరు రాజ్య సభ సభ్యులు కూడా తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇంకా ఎంత మంది రాజీనామాల బాట పడతారో ఎవరికీ తెలియదు. ఈ తరుణంలో ఢిల్లీ వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ ని తట్టుకుని ఇప్పుడు మమతా బెనర్జీ ఒంటరిగా పోరాడటం సాధ్యం అయ్యే పని కాదు అని గ్రహించి కాంగ్రెస్ లో పార్టీ ని విలీనం చేసే దిశగా ముందుకు సాగుతున్నట్లు జాతీయ మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ లో సోనియా గాంధీ తో మమతా బెనర్జీ భేటీ కావటం...ఆ తర్వాత రాహుల్ గాంధీ తో మమతా మేనల్లుడు...ఎంపీ అభిషేక్ బెనర్జీ సమావేశం కావటంతో ఒక్క సారిగా కాంగ్రెస్ లో టిఎంసి విలీనం వార్తలు ఊపు అందుకున్నాయి. విలీనం తర్వాత మమతా బెనర్జీ కి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పదవి...అభిషేక్ బెనర్జీ కి జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లో టిఎంసి విలీనం చేస్తే తప్ప ఉనికి మిగలటం కష్టం అనే అభిప్రాయానికి వచ్చే మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ నాయకురాలుగా ఉన్న మమతా తర్వాత టిఎంసి పార్టీని ఏర్పాటు చేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గా 15 సంవత్సరాల పాటు పాలించిన సంగతి తెలిసిందే. ఆమె పాలనపై వచ్చిన విమర్శలు కూడా అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఆమె తిరిగి కాంగ్రెస్ వైపు చూడటం కీలక పరిణామంగా చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున టిఎంసి..కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అని ప్రచారం జరుగుతున్న వేళ ఈ వార్తలను టిఎంసి తోసిపుచ్చుతోంది. ఇవి కేవలం పుకార్లు మాత్రమే అని ఆ పార్టీ కొట్టి పారేస్తోంది.



