Telugu Gateway
Top Stories

కామెంట్స్ చేసినందుకు కర్రతో కుమ్మేసారు

కామెంట్స్ చేసినందుకు కర్రతో కుమ్మేసారు
X

రోడ్ల పై వెళ్ళేటప్పుడు అమ్మాయిలు అప్పుడప్పుడు పోకిరీల బారినపడుతుంటారు. అమ్మాయిలే కాదు...పెళ్లి అయిన వాళ్లకు కూడా ఈ తిప్పలు తప్పవు. ప్రతి చోట ఇవి ఉంటాయని చెప్పలేము కానీ ఎక్కువ సార్లు పోకిరీల బెడద తప్పదు. చాలా సార్లు బాధితులు ఎందుకు వచ్చిన తలనొప్పి అని వీటిని భరిస్తూ ముందుకు సాగుతుంటారు. అవి మరీ శృతి మించితే మాత్రం పోలీస్ కేసు లు పెడుతుంటారు. కొంత మంది మాత్రం వాళ్లే నేరుగా రంగంలోకి దిగుతారు. ఇది అలాంటి ఘటనే. ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే ఒక యువకుడు వారిపై కామెంట్ చేశాడు. అంతే వాళ్ళు కర్రతో ఆ యువకుడికి బడత పూజ చేశారు. దీనికి సంబదించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.

ఒక యువతీ కామెంట్ చేసిన యువకుడిని గట్టిగా పట్టుకోగా...మరో యువతి కర్రతో అతడికి బుద్ధి చెప్పింది. వీరి నుంచి తప్పించుకుందుకు యువకుడు విశ్వ ప్రయత్నం చేశాడు. అయినా సరే అమ్మాయిలు ఇద్దరు రోడ్ పై వెంబడించి మరి అతగాడికి బుద్ధి చెప్పారు. ఈ సమయంలోనే రోడ్ పై వాహనాలు కూడా నిలిచిపోయాయి. ఆ సమయంలోనే కొంత మంది ఫోన్ లో వీడియో తీసి దీన్ని సోషల్ మీడియా లో పెట్టారు. ఉత్తరాఖండ్ హరిద్వార్ జిల్లా లోని రూర్కీ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అమ్మాయిల సాహసానికి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. దైర్యంగా పోకిరిని ఎదురుకొన్న తీరు ను కొనియాడుతున్నారు. పోకిరీల బెడద ను ఎదుర్కొనే వారు ఇలా చేస్తే అసలు సమస్య ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. అయితే అందరికి అంత దైర్యం ఉండాలిగా మరి.

Next Story
Share it