Telugu Gateway

హైదరాబాద్ పై అరాచక శక్తుల కుట్ర..కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ పై అరాచక శక్తుల కుట్ర..కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

జీహెచ్ఎంసీ ఎన్నికలు వాయిదా పడేలా కుట్రలు

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని, వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసు అధికారులను ఆదేశించారు. అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉందని సిఎం అన్నారు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడమే అత్యంత ప్రధానమని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వ్యక్తులు, శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పారు. సంఘ విద్రోహ శక్తులను అణచివేసే విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని సిఎం ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

''జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ది పొందడానికి కొందరు అనేక కుట్రలు చేస్తున్నారు. మొదట సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారు. మార్ఫింగ్ ఫోటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారు. తర్వాత మాటలతో కవ్వింపు చర్యలకు పూనుకున్నారు. అయినప్పటికీ సహజంగానే శాంతి కాముకులైన హైదరాబాద్ ప్రజలు వారి కవ్వింపు మాటలను, అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోలేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజల నుంచి స్పందన రావడం లేదు. డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నాలు కూడా హైదరాబాద్ లో నడవవు అని వారికి తెలిసింది. దీంతో వారు మరింత దిగజారి రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని ఏ కరీంనగర్లోనో, వరంగల్ లోనో, ఖమ్మంలోనో, మరో చోటనో గొడవలు రాజేసి, దాన్ని హైదరాబాద్ లో విస్తృత ప్రచారం చేయాలని చూస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా ఏదో ఓ చోట గొడవ పెట్టుకోవాలని, దానికి మతం రంగు పూయాలని, ప్రార్థనా మందిరాల దగ్గర ఏదో ఓ వికృత చేష్ట చేయాలని చూస్తున్నారు.

అలా చేసి ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. పెద్ద ఎత్తున గొడవలు చేసి, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి అసలు జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా చేయాలని, ఎన్నికలు వాయిదా వేయించాలని పక్కా ప్రణాళిక రచించారు. దీనికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది'' అని సిఎం కేసీఆర్ చెప్పారు. సంఘ విద్రోహ శక్తుల పట్ల, మాఫియాల పట్ల, విచ్చిన్నకర శక్తుల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందో ప్రజలు చూశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. శాంతి భద్రతలను కాపాడే విషయంలో, సంఘ విద్రోహ శక్తులను అణచివేసే విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి రాజీలేని ధోరణి అవలంభిస్తున్నది. కాబట్టే నేడు హైదరాబాద్ నగరం, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ప్రజలు సుఖంగా ఉన్నారు. ఎవరి పని వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు.' అని పేర్కొన్నారు.

Next Story
Share it