ఢిల్లీలో తగ్గని ఉద్రిక్తతలు!

ఢిల్లీ లో శనివారం నాడు అసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపీ) నేతలు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో సిజెపీ శనివారం నాడు జంతర్ మంతర్ దగ్గర నిరసన చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం లాక్ డౌన్ తరహా వాతావరణం సృష్టించింది. మెట్రో స్టేషన్స్ మూసివేయటంతో పాటు ఢిల్లీకి వచ్చే పలు రైళ్లను కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. సహజంగా కరుడుగట్టిన నేరస్థులను మాత్రమే విమానంలోకి వెళ్లి మరీ అదుపులోకి తీసుకుంటారు. కానీ సిజెపీ నేతలను అదుపులోకి తీసుకునే ముందు ఇదే విధానాన్ని అనుసరించారు. ఈ విషయంలో ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాకుండా చూసేందుకే మహిళా అధికారులను విమానంలోకి పంపినట్లు కనిపిస్తోంది అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. విమానంలో తమను అదుపులోకి తీసుకున్న విషయాలను సిజెపీ ఫౌండర్ దీప్కే తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.



