సీబీఐ, ఐబీలపై సీజెఐ సంచలన వ్యాఖ్యలు
సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరోల తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జీల ఫిర్యాదులపై ఈ సంస్థలు స్పందించిన తీరు ఏ మాత్రం సరిగాలేదన్నారు. సీజెఐ ఎన్ వి రమణ, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన జార్ఖండ్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసులో సుమోటో విచారణ సందర్భంగా రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. జడ్జిలు ఫిర్యాదు చేసినా పోలీసులు, సీబీఐ స్పందించడంలేదని, పట్టించుకోవడంలేదని జస్టిస్ రమణ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు ఐబీ, సీబీఐ సహకరించడం లేదన్నారు. జార్ఖండ్ జడ్జి హత్య వ్యవహారమే ఒక ఉదాహరణ అని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. పూర్తి బాధ్యతతోనే తానీ వ్యాఖ్యలు చేస్తున్నానన్నారు. గనుల మాఫియా ఉన్న ప్రాంతంలో జడ్జిలకు, వారి నివాస ప్రాంతాలకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు. న్యాయవ్యవస్థలో దాడులకు గురైన న్యాయమూర్తుల జాబితా తన దగ్గర ఉందన్నారు. న్యాయమూర్తుల రక్షణపై కొన్ని రాష్ట్రాలు కౌంటర్లు దాఖలు చేశాయనీ, మిగతా రాష్ట్రాలు కూడా స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని ఎన్ వి రమణ తెలిపారు. తదుపరి విచారణ ఆగస్టు 17కు వాయిదా వేశారు.
తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయవ్యవస్థను కించపరిచే ట్రెండ్ దురదృష్టకరమన్నారు. న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసే స్వేచ్ఛ కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధన్‌బాద్‌కు చెందిన జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ది అనుమానాస్పద మృతిగా, తరువాత రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగానే భావించారు. కానీ సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను ఢీకొట్టి హత్య చేసినట్లుగా తేలింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రకంపనలు పుట్టించింది. దీంతో ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు బార్ అసోసిసేషన్(ఎస్‌సీబీఏ) చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు విజ్ఞప్తి చేసింది. న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించింది. సీబీఐ ఫిర్యాదులపై వ్యవహరస్తున్న తీరు ఏ మాత్రం సరిగాలేదని..సీబీఐ తీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.