వెయ్యి కిలోమీటర్లు..రెండున్నర గంటల్లో
మౌలికసదుపాయాల కల్పనలో చైనా ప్రపంచంలోనే చాలా దూకుడుగా ఉంటుంది. అంతే కాదు..ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు కూడా అక్కడే మొదలవుతాయి. ఇప్పుడు చైనా ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే రైలును ఆవిష్కరించింది. అది ఎంత వేగంగా అంటే గంటకు 600 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఈ లెక్కన ఈ రైలు వెయ్యి కిలోమీటర్లను రెండున్నర గంటల్లోనే కవర్ చేయగలదు. అంటే ఈ సమయంలో బీజింగ్ నుంచి షాంఘై వెళ్ళొచ్చు అన్నమాట.
అదే విమానంలో అయితే బీజింగ్ నుంచి షాంఘై వెళ్ళటానికి మూడు గంటల సమయం పడుతుంది. హై స్పీడ్ రైలులో అయితే 5.5 గంటలు పడుతుంది. ఎలక్ట్రో మాగ్నటిక్ ఫోర్స్ తో ఈ రైలు నడుస్తుంది. దీని వల్ల అతి తక్కువ శబ్ద కాలుష్యం రావటంతోపాటు..నిర్వహణ కూడా ఎంతో తేలిక. ఈ రైలును మాగ్లెవ్ రైలుగా వ్యవహరిస్తారు. జపాన్, జర్మనీలు కూడా మాగ్లెవ్ నెట్ వర్క్ లు డెవలప్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.